Asianet News TeluguAsianet News Telugu

సునీల్ ఛెత్రీకి అవమానం... ఫోటో కోసం ఫుట్‌బాల్ కెప్టెన్‌ని పక్కకు తోసేసిన వెస్ట్ బెంగాల్ గవర్నర్...

దురంద్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీ జట్టుని 2-1 తేడాతో ఓడించిన బెంగళూరు ఎఫ్‌సీ...ట్రోఫీ బహుకరణ సమయంలో సునీల్ ఛెత్రీని తోసిన పశ్చిమ బెంగాల్ గవర్నర్... 

West Bengal Governor La Ganesan pushed Sunil Chhetri for photo, video goes viral
Author
First Published Sep 19, 2022, 1:57 PM IST

రాజకీయ నాయకులకు ఫోటోలు, కెమెరాల మీద ఉండే మోజు దేని మీద ఉండదు. కొన్నిసార్లు ఈ మోజే వారిని చిక్కుల్లో పడేస్తూ ఉంటుంది. తాజాగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ లా. గణేశన్ ఫోటోలో క్లియర్‌గా పడడం కోసం చేసిన ఓ పని, సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది... భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్, లెజెండరీ సాకర్ ప్లేయర్ సునీల్ ఛెత్రీ, బెంగళూరు ఎఫ్‌సీ కెప్టెన్‌గా దురంద్ కప్ 2022 టైటిల్‌ని గెలిచాడు. దురంద్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీ జట్టుని 2-1 తేడాతో ఓడించిన బెంగళూరు ఎఫ్‌సీ, మొట్టమొదటిసారి టైటిల్‌ని సాధించింది...

ఇంతకుముందు 2014, 2016 సీజన్లలో ఐ లీగ్, 2015, 2017 సీజన్లలో ఫెడరేషన్ కప్, 2018లో సూపర్ కప్, 2019లో ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్స్ గెలిచింది సునీల్ ఛెత్రీ కెప్టెన్సీలోని బెంగళూరు ఎఫ్‌సీ. అయితే కోల్‌కత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన దురంద్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ బెంగాల్ గవర్నర్ లా.గణేశన్ చేతుల మీదుగా టైటిల్ ట్రోఫీని అందుకున్నాడు సునీల్ ఛెత్రీ...

అయితే ఈ ట్రోఫీ బహుకరణ కార్యక్రమంలో గణేశన్‌తో పాటు మరికొందరు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. వీరంతా ట్రోఫీని పట్టుకుని ఫోటోలు దిగేందుకు ఎగబడడంతో గణేశన్, సునీల్ ఛెత్రీ వెనకాలకి వెళ్లిపోయి, కెమెరాలకు సరిగ్గా చిక్కలేదు. ఈ విషయాన్ని కెమెరామెన్ చెప్పడంతో సునీల్ ఛెత్రీని పక్కకు తోసేందుకు ప్రయత్నించాడు గణేశన్...

ఈ వీడియో సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. వాస్తవానికి ఫోటోల్లో పడకపోతే పక్కకు జరగమని చెప్పడంలో తప్పేమీ లేదు. లేదా నవ్వుతూ కాస్త గౌరవంగా పక్కకు జరిపినా ఇంత వివాదం రేగకపోయేది. సునీల్ ఛెత్రీ భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్. ప్రపంచంలోనే అత్యధిక ఇంటర్నేషనల్ గోల్స్ సాధించిన ప్లేయర్లలో ఒకడిగా నిలిచిన దిగ్గజం...

అలాంటి దిగ్గజం గురించి ఎల్. గణేశన్‌కి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చని, అదే ప్లేస్‌లో భారత క్రికెటర్లు, సినిమా హీరోలు ఉండి ఉంటే ఆయన ప్రవర్తించే విధానం మరింత గౌరవంగా ఉండేదని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...

మరికొందరైతే ఎల్. గణేశన్ ఎంతో కష్టపడి దురంద్ కప్ గెలిచాడని, ఆ టైటిల్ అందుకుంటున్నప్పుడు ఆయన కళ్లల్లో ఆ విజయ గర్వం ఉప్పొంగిపోతుందని పరోక్షంగా వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు.

ఫుట్‌బాల్‌కి భారత్‌లో క్రేజ్ తెచ్చేందుకు ఎంతగానో కష్టపడుతున్న సునీల్ ఛెత్రీ మాత్రం ఈ సంఘటనను చాలా లైట్‌గా తీసుకున్నాడు. తనకి ఇలాంటివి చాలా అలవాటైపోయినట్టుగా నవ్వుతూ పక్కకు జరిగి ఫోటోలు దిగాడు...

‘రెండేళ్ల ఎదురుచూపుల తర్వాత బెంగళూరుకి టైటిల్ దక్కింది. ప్రతీ సీజన్‌లోనూ టైటిల్ గెలవడానికి ఎంతగానో ప్రయత్నించాం. ఇన్నాళ్లకు ఆ ప్రయత్నాలకు ఫలితం దక్కింది. దురంద్ కప్ ఛాంపియన్స్.. ఫుట్‌బాల్ ఆడుతున్న ఓ ఆర్మీ కుర్రాడు, ఈ విజయం అందుకోకపోతే నిజంగానే అవమానకరంగా మిగిలి ఉండేది... కమ్ ఆన్... బీఎఫ్‌సీ (బెంగళూరు ఎఫ్‌సీ) అంటూ తన టోర్నీలతో దిగిన ఫోటోలను పోస్టు చేశాడు సునీల్ ఛెత్రీ..

Follow Us:
Download App:
  • android
  • ios