మైదానంలో దూకుడుగా, దురుసుగా ఉండే కింగ్ కోహ్లి అప్పుడప్పుడు తన సున్నిత మనస్తత్వాన్నీ బయట పెడుతుంటాడు.
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆదివారం ఫిబ్రవరి 9న ఒడిశాలోని కటక్‌లోని బారాబతి స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లోని రెండో వన్డేలో తన దయ, ఆప్యాయత చూపించాడు.
రెండో వన్డేలో కోహ్లీ ప్లేయింగ్ XIలోకి వచ్చాడు. టాస్ సమయంలో రోహిత్ శర్మ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించగానే కటక్ స్టేడియంలోని ప్రేక్షకులు ఉత్సాహంతో ఊగిపోయారు. కుడి మోకాలి నొప్పి కారణంగా తొిలి వన్డేకు కోహ్లీ దూరమయ్యాడు. గత నెలలో జరిగిన రంజీ ట్రోఫీతో సహా కఠినమైన షెడ్యూల్ మధ్య అతని ఫిట్‌నెస్ గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రోహిత్ శర్మ కోహ్లీ ప్లేయింగ్ XIలోకి రావడాన్ని ప్రకటించడానికి ముందు, భారత బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్ రెండో వన్డేకి స్టార్ బ్యాటర్ అందుబాటులో ఉంటాడని ధృవీకరించారు.
ఈ సందర్భంగా మాజీ భారత కెప్టెన్.. బాల్ బాయ్‌తో గడిపిన ఆప్యాయకరమైన క్షణం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. భారత బౌలింగ్ సమయంలో కోహ్లీ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు. అతను బాల్ బాయ్‌తో చేతులు కలపడానికి తాడు దాటాడు. బాల్ బాయ్ ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బాల్ బాయ్‌తో కోహ్లీ షేక్ హ్యాండ్ వీడియో
కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో కేవలం ఆరు పరుగులకే ఔటవ్వడంతో విరాట్ కోహ్లీ ఫామ్ ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. శుభ్‌మన్ గిల్ 60 పరుగులకు ఔటైన తర్వాత 136/1 వద్ద కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. రోహిత్ శర్మతో కలిసి క్రీజులోకి దిగాడు. అతను మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేస్తాడని అంతా ఆశించారు. కానీ 20వ ఓవర్లో ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో కోహ్లీ ఔటయ్యాడు. 150/2 వద్ద అతని ఇన్నింగ్స్ ముగిసింది. ఔటైన తర్వాత కోహ్లీ నిరాశతో వెనుదిరిగాడు. బారాబతి స్టేడియంలోని ప్రేక్షకులు మౌనం దాల్చారు.
ఇదిలా ఉండగా, కటక్‌లో ఇంగ్లాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన భారత్ మూడు వన్డేల సిరీస్‌ను సొంతం చేసుకుంది.
