వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ-20 సిరీస్ నుంచి విరామం తీసుకున్న కోహ్లీ ఇటీవల ఫ్యాన్స్‌తో సోషల్‌మీడియా ద్వారా మాట్లాడారు. ఈ సమయంలో ఓ ఫ్యాన్ కోహ్లీని ఓవర్‌రేటెడ్ ప్లేయర్ అని వ్యాఖ్యానించాడు.
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడ్డారు. ఓ అభిమానిపై చేసిన వ్యాఖ్యకు గాను ఆయనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యతో కోహ్లీ వివాదంలో చిక్కుకున్నారు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ-20 సిరీస్ నుంచి విరామం తీసుకున్న కోహ్లీ ఇటీవల ఫ్యాన్స్‌తో సోషల్‌మీడియా ద్వారా మాట్లాడారు. ఈ సమయంలో ఓ ఫ్యాన్ కోహ్లీని ఓవర్‌రేటెడ్ ప్లేయర్ అని వ్యాఖ్యానించాడు.
"విరాట్ కోహ్లీ ఓ ఓవర్‌రేటెడ్ బ్యాట్స్‌మెన్. అతనిలో నాకు ప్రత్యేకత ఏదీ కనిపించదు. ఇండియా వాళ్ల కంటే.. ఇంగ్లీష్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ల బ్యాటింగ్ నాకు బాగా నచ్చుతుంది" ఆ అభిమాని అన్నాడు.
దానికి సమాధానం ఇస్తూ విరాట్ కోహ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. "అలా అయితే నువ్వు ఇండియాలో ఉండకూడదు. ఎక్కడికైనా వెళ్లి జీవించు. ఇతర దేశాలను ప్రేమిస్తూ.. ఇక్కడ ఉండటం ఎందుకు. మీరు నన్ను ఇష్టపడకుంటే.. నాకు వచ్చే నష్టం లేదు. కానీ ఇక్కడ ఉంటూ వేరే దేశాన్ని ప్రశంసించడం నాకు ఇష్టం ఉండదు" అని కోహ్లీ అన్నాడు.
విరాట్ కోహ్లీ చేసిన ఆ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర దేశాల క్రికెటర్లను ఇష్టపడటం వ్యక్తిగత అభిప్రాయమని, ఆ మాత్రానికే దేశం వదిలి వెళ్లాలని అనడం ఏమిటని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
"మీరు విదేశీ దుస్తులు ధరిస్తారు, విదేశంలో పెళ్లి చేసుకుంటారు, వీదేశీ భాషలో మాట్లాడుతారు. ఇవేవీ తప్పులుగా మీకు కనిపించవు. కానీ విదేశీ క్రికెటర్లను ఇష్టపడితే మాత్రం దేశం వదిలిపోవాలా?" అని అడుగుతున్నారు.
