లండన్: ఇంగ్లాండుపై లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో ఓటమిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఇంగ్లాండుపై భారత్ 86 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.

తమ ఓటమికి ఇంగ్లాండ్‌ స్పిన్నర్సే కారణమని విరాట్ కోహ్లీ అన్నాడు. బ్యాటింగ్‌లో తమ ఆరంభం బాగుందని,  కానీ వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో నష్టపోయామని మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ మీడియాతో అన్నాడు. ఈ క్రెడిట్‌ అంతా ఇంగ్లాండు బౌలర్లదేనని, ముఖ్యంగా మోయిన్‌ అలీ, రషీద్‌లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారని ప్రశంసించాడు. 

ఈ ఫార్మాట్‌లో వారిద్దరు ఉత్తమ ప్రమాణాలున్న బౌలర్లని, అందుకే రిస్క్‌ చేయలేకపోయామని, మిడిల్‌ ఓవర్లలో వారిద్దరు తమపై ఒత్తిడి పెంచారని, ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు విఫలమైనా దాటిగా ఆడేవాళ్లమని, అ‍ప్పుడు ఫలితం వేరేలా ఉండేదని అన్నాడు. 

తాము ప్రస్తుతం కొత్త ఆటగాళ్లను పరీక్షిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు ఎలా పుంజుకుంటారనేది చాలా ముఖ్యమని అన్నాడు. అందరికి చెడు రోజులుంటూ కొన్ని ఉంటాయని, ఇలా ఈ రోజు మాకు బ్యాడ్‌ డేగా మిగిలిపోయిందని అన్నాడు. 

బ్యాటింగ్ లో ఎంఎస్ ధోనీ తడబాటుకు లోను కావడాన్ని విరాట్ కోహ్లీ సమర్థించాడు. ఓటమి దిశగా పయనిస్తున్న సమయంలో ధోనీ ఏ మాత్రం కూడా గెలుపు కోసం ప్రయత్నించిన దాఖలాలు కనిపించలేదనే విమర్శలు వచ్చాయి. అటువంటి విమర్శలు వస్తూనే ఉంటాయని కోహ్లీ అన్నాడు. 

ధోనీపై విరుచుకుపడడానికి జనాలు సిద్ధంగా ఉంటారని, బాగా అడినప్పుడు ధోనీ బెస్ట్ ఫినిషర్ అని అంటారని, ఈ రోజు ధోనీకి ఒక్కడికే కాదు తమందరికీ చెడు రోజు అని కోహ్లీ అన్నారు.