సాహో కవాని.. అయ్యో రొనాల్డో ..!
ఉరుగ్వే క్వార్టర్‌కు.. పోర్చుగల్ ఇంటికి..!
ప్రపంచకప్ అందుకోవాలన్న పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కలను ఉరుగ్వే చెదరగొట్టింది. రెండు గోల్స్‌తో ఉరుగ్వే ప్లేయర్ ఎడినసన్ కవాని చేసిన మాయాజాలం సొంత జట్టును 2-1 గోల్స్ తేడాతో క్వార్టర్‌కు చేర్చింది. పోర్చుగల్‌ను ఇంటికి సాగనంపింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా కవాని నిలిచాడు. అందరూ అనుకున్నట్టుగా జరిగితే రోనాల్డోకు ఇదే చివరి ప్రపంచక ప్ టోర్నీ అవుతుంది.
ఉరుగ్వే, పోర్చుగల్ జట్ల మధ్య శనివారం అర్థరాత్రి ఆరంభమైన రెండవ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఇరు జట్ల మధ్య సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ హోరాహోరీగా సాగింది. ప్రేక్షకులను మైమరిపించింది. ఫస్టాఫ్ ఏడవ నిముషంలో ఉరుగ్వే ప్లేయర్ ఎడిన్‌సన్ కొవాని మొదటి గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. తోటి స్టార్ ప్లేయర్ లూయిస్ సువారెజ్ పాస్ చేసిన బాల్‌ను హెడర్‌తో గోల్ పోస్ట్‌కు పంపించాడు. అత్యంత చాకచక్యంతో జట్టుకు తొలి గోల్ అందించాడు.
దీంతో అప్రమత్తమైన పోర్చుగల్ అక్కడి నుంచి బాల్‌పై ఫుల్ కంట్రోల్‌తో ఆడసాగింది. అడుగడుగునా అడ్డుపడుతున్న ఉరుగ్వే ప్లేయర్స్‌ను తోసి రాజని ఫస్టాఫ్‌లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. రెండు జట్లకు చెరో ఫ్రీ క్విక్ దక్కినా ప్రయోజనం లేకపోయింది. తలకు బాగా దెబ్బ తగలిందని రిఫరీని సువారెజ్ కన్విన్స్ చేయడంతో ఫస్టాఫ్‌కు అదనంగా మరో రెండు నిముషాలు జోడించబడింది. ఆ కాస్త సమయాన్ని గోల్‌గా మలచడంలో ఇరు జట్లు విఫలమయ్యాయి. ఫస్టాఫ్ ముగిసేసరికి 1-0 తేడాతో ఉరుగ్వే మ్యాచ్‌పై ఆధిక్యతను నిలబెట్టుకుంది.
సెకండాఫ్ మొదలైన కాసేపటికి పోర్చుగల్ ప్లేయర్ పెపె జట్టు పరువు కాపాడాడు. మరో ప్లేయర్ రాఫెల్ గురెరో చేసిన అద్భుతమైన కార్నర్ షాట్‌ను అలవోకగా అందుకున్నాడు. పోర్చుగల్‌కు తొలి గోల్ అందించి స్కోరును 1-1 తో సమం చేశాడు. ఇంకేముంది గెలుపు మాదే.. కప్ మాదే అన్న ధీమా పోర్చుగల్ ప్లేయర్స్‌లో కనిపించసాగింది. ఉత్సాహం ఉరకలేసింది. కానీ వారి ఆశను అడియాస చేస్తున్నట్టుగా 62వ నిముషంలో కవాని గోల్ చేశాడు. పెనాల్టీ ఏరియాలో రోడ్రిగో చేసిన పాస్‌ను గోల్ పోస్టులోకి పంపించి ఉరుగ్వే జట్టుకు 2-1 ఆధిక్యాన్ని కట్టబెట్టాడు.
ఒకానొక తప్పిదాన్ని తనకు అనుకూలంగా మలచుకున్న రొనాల్డో, ఉరుగ్వే తరఫున 2 గోల్స్ చేసి మూడో గోల్ చేయడానికి ఉవ్విళ్ళూరుతున్న కవానీని 77వ నిముషం వద్ద బైటకు పంపించడంలో విజయం సాధించాడు. ఉరుగ్వే ప్లేయర్స్ సంఖ్యను 10కి పరిమితం చేశాడు. ఆ తర్వాత ఐదు నిముషాలకు అంది వచ్చిన ఫ్రీ కిక్‌ను ఉపయోగించుకోవడంలో ఉరుగ్వే విఫలమైపోయింది.
ఇంకేముంది చివరి నిముషాల్లో పోర్చుగల్ అద్భుతం చేసి మ్యాచ్‌ను కైవసం చేసుకోవచ్చనే అంచనాలకు అది ఆస్కారమిచ్చింది. ఇక రెండు నిముషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా ఫ్రీ కిక్ ఇవ్వడానికి నో చెప్పిన రిఫరీని ఓ మాట అన్నందుకు రొనాల్డొ అడ్డంగా బుక్ అయిపోయాడు. ఫైనల్ విజిల్ వినిపించింది. 2-1 గోల్స్ తేడాతో ఉరుగ్వే విజయ ఢంకా మోగించింది. క్వార్టర్ బాట పట్టింది. పోర్చుగల్ ఇంటి బాట పట్టింది.