CWG 2022: నిన్న లంక క్రీడాకారులు.. నేడు పాక్ బాక్సర్లు.. బర్మింగ్‌హామ్‌లోనే అదృశ్యమవుతున్న ఆటగాళ్లు

Commonwealth Games 2022: ఇటీవలే ముగిసిన 22వ కామన్వెల్త్ క్రీడల తర్వాత  పాకిస్తాన్ క్రీడా బృందం ఇంటికి తిరుగు ప్రయాణమైంది.  ఇంటికి వెళ్లేందుకు బర్మింగ్‌హామ్ ఎయిర్ పోర్టు వరకు అందరూ కలిసే వచ్చినా ఇద్దరు బాక్సర్లు మాత్రం...

Two Pakistani boxers go missing after CWG 2022 in Birmingham

కామన్వెల్త్ క్రీడల కోసం వెళ్లిన ఆటగాళ్లు  వెళ్లామా.. ఆడామా.. వచ్చామా..? అన్నట్టుగా ఉంటే అది వారితో పాటు  క్రీడా అసోసియేషన్‌లకు, దేశానికీ మంచిది. అలా కాకుండా  ఆడటానికి వెళ్లిన ఆటగాళ్లు అక్కడే తప్పిపోతే..? అది కచ్చితంగా అసోసియేషన్లతో పాటు ఆ దేశానికీ తలనొప్పే. ఇప్పటికే సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న  శ్రీలంక, పాకిస్తాన్ లు  ప్రస్తుతం మరో సమస్యతో వార్తలకెక్కాయి. కామన్వెల్త్ ల ఆడటానికని వెళ్లిన బాక్సర్ల బృందంలో ఇద్దరు బాక్సర్లు.. బర్మింగ్‌హామ్ లోనే అదృశ్యమయ్యారట.  వాళ్ల ఆచూకీ కోసం యూకే పోలీసులు గాలిస్తున్నారు. 

ఇటీవలే ముగిసిన 22వ కామన్వెల్త్ క్రీడల తర్వాత  పాకిస్తాన్ క్రీడా బృందం ఇంటికి తిరుగు ప్రయాణమైంది.  ఇంటికి వెళ్లేందుకు బర్మింగ్‌హామ్ ఎయిర్ పోర్టు వరకు అందరూ కలిసే వచ్చినా అక్కడ్నుంచి ఇద్దరు బాక్సర్లు అదృశ్యమయ్యారని తెలుస్తున్నది. 

కనబడకుండా పోయిన బాక్సర్లను నజీర్, సులేమాన్ గా గుర్తించారు. నజీర్ 86-92 కేజీల విభాగంలో పోటీ పడుతుండగా.. సులేమాన్ 60-63 విభాగంలో  పోటీ పడుతున్నాడు. ఈ ఇద్దరూ  కామన్వెల్త్ గేమ్స్ లో ప్రి క్వార్టర్ కు కూడా చేరలేదు.  

బర్మింగ్‌హామ్ లో కనిపించకుండా  పోయిన ఇద్దరు బాక్సర్ల ఆచూకీ కోసం పాకిస్తాన్ అధికారుల బృందం స్థానిక పోలీసులను ఆశ్రయించింది. వారిని  త్వరగా గుర్తించి తమకు అప్పగించాలని కోరింది. ఈ ఇద్దరి బాక్సర్ల పాస్ పోర్టులు అసోసియేషన్ వద్దే ఉన్నట్టు తెలుస్తున్నది.  బాక్సర్ల ఆచూకీ దొరకకుంటే ఆ పాస్ పోర్టులను సీజ్ చేస్తామని పాకిస్తాన్ ఒలింపిక్ అసోసియేషన్  హెచ్చరించింది.

 

పాకిస్తాన్ తో పాటు శ్రీలంకకు చెందిన సుమారు 10 మంది అథ్లెట్లు కూడా కనిపించకుండా పోయిన విషయం విదితమే. బర్మింగ్‌హామ్ కు వెళ్లిన 110 మందిలో ఒక రెజ్లర్, జూడోక,  జూడో కోచ్ తో పాటు ఏడుగురు అథ్లెట్లు కూడా తప్పిపోయారట.  110 మంది క్రీడాకారులు,  51 మంది  అఫిషీయల్స్ తో కూడిన బృందంలో పది మంది దాకా తప్పిపోవడంతో  బర్మింగ్‌హామ్ లో లంక  బృందం లెక్కతప్పింది.

ఆటల కోసమని వచ్చిన ఆటగాళ్లలో మిస్ అయినవాళ్లు తమ బ్యాగులను  క్రీడాగ్రామంలోనే వదిలి అక్కడ్నుంచి  మిస్ అయ్యారు. వీళ్లకు ఆరునెలల పాటు  వీసాలున్నాయని తెలుస్తున్నది. అయితే  అదృష్యమైన తొలి ముగ్గురు అథ్లెట్లను బర్మింగ్‌హామ్ పోలీసులు వెతికి పట్టుకున్నారని, కానీ వాళ్లను ఎక్కడ ఉంచింది మాత్రం వెల్లడించలేదని లంక ప్రతినిధులు తెలిపారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios