కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్రీడలకు సంబంధించిన మేజర్ టోర్నమెంట్లు వాయిదా పడ్డాయి. ప్రఖ్యాత టోక్యో ఒలింపిక్స్‌ను సైతం ఒలింపిక్స్  కమిటీ ఏడాది పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ కొత్త తేదీలను నిర్వహక కమిటీ సోమవారం ప్రకటించింది. 2021 జూలై 23న క్రీడలు ఆరంభమవుతాయని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్‌ జూలై 23న ఆరంభమై ఆగస్టు 9న ముగియాల్సి ఉంది.

Also Read:కరోనా మాయ... నో సెలూన్, ఎవరి జుట్టు వాళ్లే..

జపాన్‌లో కరోనా వ్యాప్తి చెందుతుండటంతో తొలుత వసంతకాలానికి వాయిదా వేయాలని నిర్వాహాకులు భావించారు. అయితే అదే సమయంలో అక్కడ మరో వేడుక జరగనుంది. దానితో పాటు యూరోపియన్ సాకర్, ఉత్తర అమెరికా క్రీడా పోటీలూ అడ్డుగా వస్తాయి.

ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఒలింపిక్స్ క్రీడలను 2020లోనే నిర్వహిస్తామని ఒలింపిక్ సంఘం చెబుతూ వచ్చింది. కోవిడ్ 19 కారణంగా దేశాలకు దేశాలే లాక్‌‌డౌన్‌లోకి వెళ్లడంతో పలు దేశాలు, క్రీడాకారులు ఐవోసీని తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు.

Also Read:లాక్ డౌన్ తో బాయ్ ఫ్రెండ్ దూరం.. గుత్తాజ్వాలా విరహ వేదన

చివరికి క్రీడలు వాయిదా వేయక తప్పలేదు. క్రీడలను రీషెడ్యూల్ చేయడం వల్ల ఖర్చు భారీగా పెరుగుతుందని టోక్యో నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యాషిరో మోరి, సీఈవో తుషిరో ముటో అన్నారు. పారదర్శకంగా ఖర్చులను గణిస్తామని, అవి ఎలా ఉంటాయో సమయమే చెబుతుందని యాషిరో మోరి తెలిపారు.

ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. క్రీడలను వాయిదా వేయడం వల్ల 4 బిలియన్ డాలర్ల వరకు ఖర్చులు పెరుగుతుందని కన్‌సాయి యూనివర్సిటీ క్రీడా ఆర్ధిక రంగం నిపుణుడు కటసుహిరో మియామోటో అన్నారు.