ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ టాప్-10లో ముగ్గురు భారత బ్యాటర్లు.. రెండో స్థానంలో శుభ్ మన్ గిల్...
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ టాప్-10లో ముగ్గురు భారత బ్యాటర్లు స్థానం సంపాదించుకున్నారు. రెండో స్థానంలో శుభ్ మన్ గిల్ నిలిచాడు.

దుబాయ్ : ముగ్గురు భారత బ్యాటర్లకు ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో చోటు దక్కడం విశేషం. టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ వన్డేల్లో రెండో ర్యాంకు సాధించి అత్యుత్తమంగా నిలిచారు. శుభ్ మన్ గిల్ రెండో ర్యాంకులో నిలవగా.. రోహిత్ శర్మ 8వ స్థానంలో, కోహ్లీ 9వ స్థానంలో నిలిచారు. 2019 జనవరిలో చివరిసారిగా భారత్ నుంచి ముగ్గురు బ్యాటర్లు టాప్ టెన్ లో ఉన్నారు. ఆ సమయంలో తొలి పదిమందిలో రోహిత్, కోహ్లీలతో పాటు శిఖర్ ధావన్ కూడా ఉన్నాడు.
ఆసియా కప్ లో పాకిస్తాన్ పై జరిగిన మ్యాచ్లో రోహిత్ తో కలిసి తొలి వికెట్ కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 58 పరుగులు చేసి తాజా ర్యాంకింగ్లో తాను ఉన్న స్థానం నుంచి ఓ ర్యాంకు ఎగబాకాడు. ఇదే మ్యాచ్లో 122 పరుగులు చేసి పాకిస్తాన్ పై అజయంగా నిలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రికార్డు కొట్టిన కోహ్లీ రెండు స్థానాలు మెరుగయ్యాడు.
టీమిండియాకు జై కొడుతున్న ఆఫ్ఘాన్ మిస్టరీ గర్ల్..!
ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్న రోహిత్ కూడా రెండు స్థానాలు ఎగబాకాడు. భారత బ్యాటర్లతో పాటు పాకిస్తాన్ బ్యాటర్లు ముగ్గురు కూడా టాప్ టెన్ లో ఉన్నారు. వీరిలో బాబర్ అజాం గిల్ కంటే 100 రేటింగ్ పాయింట్లు ఎక్కువతో నెంబర్ వన్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. ఇమాముల్ హక్ ఐదు, ఫకర్ జమాన్ పది స్థానాల్లో ఉన్నారు.
దక్షిణాఫ్రికా బ్యాటర్ టెంబా బవుమా గత ఎనిమిది వన్డేల్లో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేసి టాప్ టెన్ కు దగ్గరయ్యాడు. ఇక భారత క్రికెటర్ల విషయానికి వస్తే ఆసియా కప్ తో కేఎల్ రాహుల్ తిరిగి ఆటలోకి అడుగు పెట్టాడు. ఈ ఆటలో రాహుల్ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 37వ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 22వ స్థానంలో నిలిచాడు.
కుల్దీప్ యాదవ్ ఇండియన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ వన్డే బౌలర్ల జాబితాలో టాప్ టెన్ లో చోటు సంపాదించుకున్నాడు. తాజాగా కుల్దీప్ యాదవ్ ఐదు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకు చేరుకున్నాడు. ఆసియా కప్ లో రెండు మ్యాచ్ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ తో పాటు టాప్ టెన్ లో సిరాజ్ కూడా ఉన్నాడు. నెంబర్ వన్ బౌలర్ గా జోష్ హేజిల్ వుడ్ కొనసాగుతున్నాడు. 27వ స్థానంలో బుమ్రా, 56వ స్థానంలో హార్దిక్ పాండ్యా ఉన్నారు.