వచ్చే ఏడాది ఇంగ్లాండ్ లో టీం ఇండియా వన్డే ప్రపంచకప్ ఆడాల్సి ఉంది. అయితే.. అక్కడ గెలవాలంటే.. మాత్రం తమకు అరటిపండ్లు కావాల్సిందేనని కోహ్లీ సేన డిమాండ్ చేస్తోంది. మీరు చదివింది నిజమే.. ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో టీం ఇండియా ప్రదర్శన పేలంగా  ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. అక్కడ సరైన సదుపాయాలు ముఖ్యంగా అరటిపండ్లు ఇవ్వలేదట. అందుకే ఓడిపోయామని సమాధానమిస్తున్నారు ఆటగాళ్లు.

దీంతో తదుపరి మ్యాచ్ లలో తమకు కావాల్సిన డిమాండ్లను ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సమీక్షా సమావేంలో కెప్టెన్ కోహ్లీ.. బీసీసీఐకి వివరించారు.  ఇందులో సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌తో పాటు సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కూడా పాల్గొన్నారు. ‘ఇంగ్లండ్‌ పర్యటన సమయంలో మన ఆటగాళ్లు ఇష్టపడిన ఫలాలు ఆతిథ్య బోర్డు అందించలేదు. 

అయితే సీఓఏ ఈ డిమాండ్‌ పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బీసీసీఐ ఖర్చులతో తమకు అరటిపండ్లు తెచ్చి పెట్టమని టీమ్‌ మేనేజర్‌ను క్రికెటర్లు అడగాల్సింది కదా అని వారు అభిప్రాయ పడ్డారు’ అని బోర్డులో కీలక సభ్యుడొకరు దీనిపై వ్యాఖ్యానించారు. సరైన జిమ్‌ సదుపాయాలు ఉన్న హోటళ్లను మాత్రమే తమ కోసం బుక్‌ చేయాలని కూడా కోహ్లి బృందం సీఓఏను కోరింది.

అన్నింటికి మించి వరల్డ్‌ కప్‌ సమయంలో తాము రైలులోనే ప్రయాణం చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని, అందుకోసం ఒక ప్రత్యేక బోగీని బ్లాక్‌ చేయాలని కూడా భారత క్రికెటర్లు కోరుతున్నారు. ‘ఇంగ్లండ్‌లో రైలు ప్రయాణమే సౌకర్యవంతంగా ఉంటుందని టీమిండియా సభ్యులు చెప్పారు. అభిమానులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉండటం, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని అందుకు ముందుగా సీఓఏ అంగీకరించలేదు. 

అయితే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మాత్రం సీఓఏ కానీ బీసీసీఐ కానీ బాధ్యత వహించదని షరతు పెట్టి దీనికి అంగీకరించింది’ అని బోర్డు అధికారి వెల్లడించారు. పర్యటన మొత్తం తమ భార్యలను వెంట తీసుకెళ్లేందుకు అనుమతించాలని కూడా డిమాండ్‌ చేశారు. అయితే దీనిపై సీఓఏ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

భార్యలు వెంట ఉంటేనే తమ ఏకాగ్రత చెడుతుందని కొందరు క్రికెటర్లు భావిస్తారని, అందరితో చర్చించిన తర్వాత దీనిపై ఆలోచిస్తామని సీఓఏ స్పష్టం చేసింది. త్వరలో జరిగే ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో మాత్రమే రెండు వారాల పాటు భార్యలను అనుమతిస్తామని, వారు టీమ్‌ బస్సులో ప్రయాణించడానికి వీల్లేదని సీఓఏ గతంలోనే నిర్ణయం తీసుకుంది.