టీ20లో టీమిండియా విజయం... దేశమంతా ఫిదా

T20 World Cup Champion India: టీ20 ప్రపంచ కప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాను చూసి దేశమంతా గర్విస్తోంది. భారత ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తోంది. ప్రపంచ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.   

Team India's victory in T20... the whole country celebrates GVR

టీ20 వరల్డ్‌ కప్-2024 పోరులో భారత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రత్యర్థి జట్టు సౌతాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి... తిరుగులేని విజయం అందుకుంది. టీ20 ప్రపంచ కప్‌లో 17 ఏళ్ల తర్వాత చాంపియన్‌గా నిలిచిన భారత్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. భారత ఆటగాళ్లపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. 


విదేశీ గడ్డపై భారత చరిత్ర సృష్టించడంపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తదితరులు టీమిండియాకు అభినందనలు తెలిపారు. భారత క్రికెట్ జట్టును గర్వపడుతున్నామంటూ సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్ట్‌ చేశారు. 
‘‘ఛాంపియన్స్! మా జట్టు టీ20 వరల్డ్‌ కప్‌ను గొప్ప ‘స్టైల్’లో ఇంటికి తీసుకొచ్చింది!. మేం టీమిండియాను చూసి గర్వపడుతున్నాం. ఈ మ్యాచ్ చరిత్రాత్మకం’’ అని మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దేశ ప్రజల తరఫున భారత జట్టుకు అభినందనలు తెలిపారు. టీమిండియా ఆడిన తీరుకు 140 కోట్ల మంది భారతీయులు గర్వపడుతున్నారన్నారు. ప్రపంచ కప్‌తో పాటు దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు.

 

టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్ విజయంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ఇది అసాధారణ విజయమని కొనియాడారు. టీమిండియాకు అభినందనలు తెలుపుతూ పోస్ట్‌ పెట్టారు. టీమిండియా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నా టోర్నమెంట్ అంతటా అద్భుత ప్రదర్శనిచ్చిందని ప్రశంసించారు. ఫైనల్ మ్యాచ్‌లో అసాధారణ విజయం సాధించిందని అభినందించారు. భారత జట్టును చూసి గర్వపడుతున్నామని పేర్కొన్నారు. 

 

అలాగే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా టీమిండియాకు అభినందనలు తెలియజేశారు. “ప్రపంచ కప్‌లో గొప్ప విజయం సాధించడంతో పాటు టోర్నమెంట్‌ మొత్తం భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. సూర్యకుమార్‌ క్యాచ్ పట్టిన తీరు, రోహిత్‌ శర్మ కెప్టెన్సీ అద్భుతం. రాహుల్, టీమిండియా మీ గైడెన్స్ మిస్ అవుతుందని నాకు తెలుసు’’ అని పోస్టు చేశారు. అద్భుతమైన మెన్ ఇన్ బ్లూ దేశం గర్వపడేలా చేసిందని కొనియాడారు. 

 


విశ్వ విజేతలకు అభినందనలు...
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సైతం భారత జట్టు విజయాన్ని ప్రశంసించారు. అద్భుత ఆటతీరు ప్రదర్శించిన ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు.

రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలచిన భారత జట్టుకు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందనలు. ‘‘140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలచిపోతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమష్టిగా రాణించిన తీరు అద్భుతం. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఒత్తిడిని జయంచి సగర్వంగా ప్రపంచకప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరుపేరునా హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీ విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్‌లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios