మన కలలు చెదిరె.. కీలక పోరులో స్పెయిన్ చేతిలో ఓటమి.. హాకీ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన భారత్..
Hockey Women's World Cup: ఎన్నో ఆశలతో మహిళల హాకీ ప్రపంచకప్ ఆడటానికి వెళ్లిన భారత జట్టుకు భారీ షాక్ తగలింది. కీలక పోరులో స్పెయిన్ చేతిలో టీమిండియా దారుణంగా ఓడింది.
స్పెయిన్, నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న FIH Hockey Women’s World Cup లో భారత జట్టుకు మరోసారి నిరాశ తప్పలేదు. 15వ ఎడిషన్ (ప్రపంచకప్)లో అయినా సత్తా చాటాలని భావించిన భారత జట్టు కలలు కల్లలయ్యాయి. ఆతిథ్య స్పెయిన్ తో జరిగిన కీలక మ్యాచ్ లో భారత్ 0-1 తో పరాజయాన్ని మూటగట్టుకున్నది. చివరి నిమిషం వరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్ లో గెలిచిన స్పెయిన్ క్వార్టర్స్ కు చేరింది.
ప్రపంచకప్ క్వార్టర్స్ ఫైనల్స్ కు వెళ్లాలంటే తప్పకుండా నెగ్గాల్సిన మ్యాచ్ లో సవిత పునియా నేతృత్వంలోని భారత అమ్మాయిలు తీవ్రంగా నిరాశపరిచారు. తొలి అర్థ భాగంలో బాగానే ఆడిన అమ్మాయిలు తర్వాత స్పెయిన్ డిఫెన్స్ ను అడ్డుకున్నా చివరి క్షణాల్లో పట్టువిడవడంతో మ్యాచ్ చేజారింది.
తొలి అర్థభాగంలో ఇరు జట్లు గోల్స్ ఏం చేయలేదు. కానీ రెండో అర్థ భాగంలో మ్యాచ్ మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా.. స్పెయిన్ ప్లేయర్ మార్టా సెగు క్లారా కార్ట్ ఇచ్చిన బంతిని నేరుగా గోల్ పోస్ట్ లోకి పంపింది. అయితే చివర మిగిలున్న టైమ్ లో కూడా భారత జట్టు గోల్ కొట్టడానికి తీవ్రంగా యత్నించినా స్పెయిన్ డిఫెండర్లు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా భారత జట్టు ప్రపంచకప్ ఆశలు ఆవిరయ్యాయి.
ప్రపంచకప్ ఆశలు చెదిరిపోవడంతో భారత జట్టు.. 9-16 స్థానాల మధ్య జరిగే పోరులో తమ తదుపరి మ్యాచ్ లో కెనడాను ఢీకొంటుంది. జులై 12 న ఈ మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుతానికి న్యూజిలాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రేలియా, స్పెయిన్, అర్జెంటీనా, ఇంగ్లాండ్ లు క్వార్టర్స్ కు చేరాయి. క్వార్టర్స్ మంగళవారం నుంచి ప్రారంభమవుతాయి. జులై 16, 17 న సెమీస్.. 18న ఫైనల్ జరుగుతుంది.