టీంఇండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పై గతకొంత కాలంగా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది మొత్తం ధోని ఫామ్ కోల్పోయి ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ధోనీ కూడా తన రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడని...త్వరలో అందుకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని ఊహాగానాలు ప్రచారమయ్యారు. అయితే ధోనీ మాత్రం 2019 ప్రంపంచకప్ వరకు క్రికెట్ కు గుడ్ బై చెప్పే ప్రసక్తే లేదని ప్రకటించి ఈ ప్రచారానికి తెరదించాడు. 

అయితే తాజాగా వరల్డ్ కప్ దగ్గరపడుతున్న కొద్ది ధోనికి సంబంధించిన మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అతడు చెప్పినట్లే ఈ ప్రపంచ కప్ టోర్నీ ముగిసిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని మరోసారి ఊహాగానాలు వెలువడుతున్నాయి. వీటిపై తాజాగా టీంఇండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు.  

వరల్డ్‌కప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదని ప్రసాద్ స్పష్టం చేశాడు. ధోని దగ్గరి నుండి అలాంటి సమాచారమేదీ తమకు అందలేదని తెలిపారు. అయితే ప్రపంచ కప్ కు ముందు ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం మంచిది కాదని ప్రసాద్ సూచించారు. 

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల ద్వారా మళ్లీ ఫామ్ లోకి వచ్చిన ధోని వరల్డ్ కప్ కోసం సిద్దమవుతున్నాడని ప్రసాద్ వెల్లడించారు. అయితే అతడు వరుసగా మరిన్ని మ్యాచులు ఆడటం అవసరమని...ఐపీఎల్ అందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.  మధ్యలో ప్రాక్టీస్‌ లేకపోవడం వల్ల ధోని బ్యాటింగ్ లో కొంత జోరు తగ్గి ఉండవచ్చు... కానీ అతని కీపింగ్‌ లో పదును ఏమాత్రం తగ్గలేదని ప్రసాద్ ప్రశంసించాడు. 

ధోని ఇప్పటికీ మ్యాచ్ విన్నరేనని ఆస్ట్రేలియా పర్యటనలో మరోసారి రుజువయ్యిందని ప్రసాద్ తెలిపారు. వరల్డ్ కప్ మెగా టోర్నీలో అతడు చాలా విలువైన ఆటగాడని పేర్కొన్నారు. కెప్టెన్ కోహ్లీ‌తో పాటు భారత ఆటగాళ్లకు అనుభవంతో కూడిన ధోని సలహాలు చాలా ముఖ్యమని ప్రసాద్ వెల్లడించారు.