భారత్-ఆస్ట్రేలియా జట్లు మధ్య జరుగుతున్న టెస్ట్ సీరిస్ రసవత్తరంగా సాగుతోంది. అయితే మెల్ బోర్న్ లో జరిగిన మూడో టెస్టులో భారత్ ఘన విజయం సాధించబట్టి కోహ్లీ భారీ విమర్శల నుండి తప్పించుకున్నాడు...కానీ ఒకవేళ ఫలితంలో ఏమైనా తేడా వచ్చుంటే అతడి పరిస్థితి మరోలా ఉండేది. ఇంతకూ కోహ్లీ చేసిన ఆ ప్రయోగమేంటి...అతడు ఎందుకలా చేయాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే. 

మెల్ బోర్స్ టెస్టులో మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ భారీ స్కోరు సాధించి ప్రత్యర్థి జట్టును అతి తక్కువ స్కోరుకు ఆలౌట్ చేసింది. దీంతో భారత్ కు భారీ ఆధిక్యం లభించింది. ఇలాంటి సమయంలో టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ ప్రయోగం చేశాడు. భారీ పరుగులు వెనుకబడ్డ ఆస్ట్రేలియాను పాలోఆన్ ఆడించకుండా భారత్ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఈ ప్రయోగం తప్పని ఆదిలోనే అతడికి అర్థమయ్యింది. రెండో ఇన్నింగ్సులో ప్రమాదం నుండి తప్పించేకునేందుకు అతి తక్కువ స్కోరుకే డిక్లేర్ చేసి ఆస్ట్రేలియాకు బ్యాటింగ్ అప్పగించారు. 

అయితే ఇలా ఆస్ట్రేలియాను పాలోఆన్ ఆడించకపోవడం విమర్శలకు దారితీసింది. దీనిపై తాజాగా కోహ్లీ వివరణ ఇచ్చాడు. ఆసిస్ బౌలర్లకు ఎక్కువ విశ్రాంతి ఇస్తే వారు పుంజుకుంటారనే తాము బ్యాటింగ్ దిగినట్లు కోహ్లీ వివరించాడు. ఆసిస్ బ్యాట్ మెన్స్ మనోధైర్యాన్ని దెబ్బతీసే ఉద్దేశ్యంతో వారిముందు మరింత ఎక్కువ లక్ష్యాన్ని  ఉంచాలన్నది కూడా మరో ఆలోచన అని కోహ్లీ పేర్కొన్నారు.   

అలాగే ఆసిస్‌ను ఫాలో ఆన్ ఆడిస్తే తమ ఆటగాళ్లు మరింత ఎక్కువసేపు ఫీల్డింగ్ చేయాల్సి వచ్చేది. దీంతో వారు అలసిపోయి  ఆ ప్రభావం వారి బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ పై పడేది. అలాగే  ఫాలో ఆన్ ‌ఆడిస్తే ఒకవేళ ఆసిస్ పుంజుకుని ఎక్కువ పరుగులు చేస్తే తమ బ్యాట్ మెన్స్ పై తీవ్ర ప్రభావం పడేది. అందువల్లే అన్ని కోణాల్లో ఆలోచించే ఆసిస్ ను ఫాలో ఆన్ ఆడించలేదని...అది అనాలోచిన నిర్ణయం కాదని విరాట్ కోహ్లీ వెల్లడించారు.