భారత జట్టులో ఇప్పుడు విధ్వంసకర బ్యాట్ మెన్ ఎవరంటే టక్కుర గుర్తొచ్చే పేరు రోహిత్ శర్మ. తన విద్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోయడంలో రోహిత్ సిద్దహస్తుడు. ప్రస్తుతం విండీస్ తో జరుగుతున్న టీ20 సీరిస్ లో రోహిత్ ఓ వైపు కెప్టెన్‌గా, మరోవైపు బ్యాట్ మెన్ గా రాణిస్తూ జట్టుకు రెండు అద్భుత విజయాలను అందించాడు. ఇక రెండో టీ20 లో విధ్వంసకర బ్యాటింగ్ తో సెంచరీకి చేసి జట్టుకు విజయాన్ని అంధించాడు. దీంతో అతడిపై అభిమానులు, మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా టీంఇండియా మాజీ సారథి గవాస్కర్ ముంబయి టీ20 లో రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని ప్రశంసించాడు. మంచి ఫామ్ లో వున్న రోహిత్ బ్యాటింగ్‌ను చూస్తుంటే తనకు వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుకు వస్తున్నాడని అన్నాడు. సెహ్వాగ్ మాదిరిగానే రోహిత్ ఓపెనర్ గా బరిలోకి  దిగుతూ...అదే ధనాధన్ షాట్లతో ఆకట్టుకుంటున్నాడని పేర్కొన్నారు. వీరిద్దరి బ్యాటింగ్ ఒక్కసారి ఊపందుకుందంటే ఆపడం బౌలర్లకు చాలా కష్టపని గవాస్కర్ పేర్కొన్నారు.

షాట్ల ఎంపిక విషయంలో సెహ్వాగ్ కంటే రోహితే మెరుగ్గా కనిపిస్తాడని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. సెహ్వాగ్ బౌండరీ బాదిన తర్వాత ఓసారి పీల్డింగ్ ఎలా ఉందో  చూసుకునేవాడని...కానీ రోహిత్ అవేవి చూసుకోకుండా అలవోకగా వరుస బౌండరీలు బాదుతాడని అన్నాడు. భవిష్యత్ లో విధ్వంసకర బ్యాట్ మెన్స్ జాబితాలో రిచర్డ్స్,సెహ్వాగ్ సరసన రోహిత్ కూడా చేరతాడని గవాస్కర్ తెలిపాడు.