శ్రీలంక మాజీ క్రికెటర్, ప్రస్తుత పెట్రోలియం శాఖ మంత్రి అర్జున్ రణతుంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జరిగిన కాల్పుల ఘటనతో దేశంలో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఈ కాల్పులు రణతుంగన ఆదేశాలతోనే జరిగినట్లు భావిస్తున్న పోలీసులు ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేశారు. దీంతో శ్రీలంక లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. 

మంత్రి అర్జున్ రణతుంగను అడ్డుకోడానికి ప్రయత్నించిన ఆందోళనకారులపై ఆయన బాడీగార్డ్స్ కాల్పులకు దిగారు. అయితే ఈ కాల్పుల్లో ముగ్గురరికి తీవ్రంగా గాయాలవడంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇలా  గాయపడిన వారిలో ఓ వ్యక్తి ఆదివారం రాత్రి మరణించాడు. దీంతో దేశంలో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. 

ఈ కాల్పులకు వ్యతిరేకంగా దేశంలోని పెట్రోలియం యూనియన్లు సమ్మెకు దిగాయి. మంత్రి రణతుంగను అరెస్టు  చేసే వరకు పెట్రోల్ సరఫరాను నిలిపివేసి సమ్మె చేస్తామని హెచ్చరించారు. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడి వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. 

కాల్పుల ఘటనలో ఇప్పటికే రణతుంగా బాడీగార్డులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా  మంత్రి ఆదేశాలతోనే తాము కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. దీంతో పోలీసులు అర్జున్ రణతుంగను అరెస్టు చేశారు. 

అయితే ఆందోళనకారులు రణతుంగపై దాడికి ప్రయత్నిచడం వల్లే రక్షణ సిబ్బంది కాల్పులు జరిపారని మంత్రి కార్యాలయ ప్రతినిధి థమీర తెలిపారు. కార్యాలయం ద్వారాన్ని విరగ్గొట్టి రణతుంగను పట్టుకునే ప్రయత్నం చేయగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రక్షించారని వెల్లడించారు.