Asianet News TeluguAsianet News Telugu

స్పోర్ట్స్ వీక్లి రౌండప్: కోహ్లీసేన ఓటమితో ఆరంభం...కశ్యప్ ఓటమితో ముగింపు... మరెన్నో

వారంలో ఆరు రోజులు తమ తమ పనుల్లో బిజీబిజీగా వుండేవారికి తీరిక దొరికేది కేవలం ఆదివారం మాత్రమే. అయితే ఇలా పనుల్లో పడిపోయి మనలో చాలామంది చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి వారు కేవలం ఒక్కరోజులోనే ఈ వారం మొత్తం ఏయే క్రీడావిభాగాల్లో ఏం జరిగిందో సమగ్ర సమాచారాన్ని ఈ వీక్లీ రౌండప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇలా వారం రోజుల వార్తలను సంక్షిప్తంగా మీ ముందుంచేందుకు మీ, మా,మన ఏషియా నెట్ తెలుగు మీ ముందుకు వీక్లీ రౌండప్ పేరుతో మీ ముందుకు వచ్చింది.

sports weekly roundup asianet news special
Author
Hyderabad, First Published Sep 29, 2019, 12:10 PM IST

బెంగళూరు టీ20లో టీమిండియా ఓటమి...సీరిస్ మిస్ 

భారత్-సౌతాఫ్రికాల మధ్య జరిగిన టీ20 సీరిస్ సమమయ్యింది. మొహాలీ టీ20లో పర్యాటక జట్టును ఓడించగలిగిన కోహ్లీసేన ఆటలు బెంగళూరులో మాత్రం సాగలేదు. నిర్ణయాత్మకమైన ఈ టీ20 మ్యాచ్ లో సౌతాఫ్రికా ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా రాణించి భారత్ పై పైచేయి సాధించారు. ఇలా ప్రపంచ కప్ తర్వాత టీమిండియా మొదటి ఓటమిని చవిచూసింది. 

తమిళనాడు క్రికెట్లో మళ్లీ శ్రీనివాసన్ హవా...ఈసారి కూతురు 

భారత క్రికెట్ ను ఎంతో ప్రభావితం చేసిన బిసిసిఐ అధ్యక్షుల్లో ఎన్. శ్రీనివాసన్ ఒకరు. అయితే పలు వివాదాల నేపథ్యంలో అతడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష పదవి నుండి అర్థాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అతడు తన వారుసురాలిగా కూతురు రూపా గురునాథ్ ను ఎంచుకున్నారు. క్రికెట్ వ్యవహారాల్లో తన పట్టు ఏమాత్రం తగ్గలేదని  శ్రీనివాసన్ మరోసారి నిరూపించుకున్నారు. తన కూతురు రూపాను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఏకగ్రీవమయ్యేట్లు పావులుకదిపి చివరకు అనుకున్నది సాధించారు.  

బంగ్లాదేశ్ తో సీరిస్ కు కూడా ధోని దూరమే 

ఇంగ్లాండ్ వేదికన జరిగిన వన్డే ప్రపంచ కప్ తర్వాత సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని భారత జట్టుకు దూరమయ్యాడు. ఈ మెగా టోర్నీ తర్వాత అతడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై  చెప్పి క్రికెట్ కు పూర్తిగా దూరమవనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేకపోయినా వ్యక్తిగత కారణాలతో కొంతకాలం మాత్రం జట్టుకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇప్పటికే అతడు జట్టులో చేరాల్సివుండగా అలా జరగలేదు.  ధోని పునరాగమనం మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని బిసిసిఐ అధికారి ఒకరు తెలియజేశారు. ఇప్పటికే సౌతాఫ్రికా సీరిస్ కు అతడు దూరమవగా నవంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగే టీ20 సీరిస్ కు అతడు దూరమవనున్నాడని సమాచారం


విరాట్ కోహ్లీ మ్యాచ్ రెఫరీ వార్నింగ్...

ఇప్పటికే బెంగళూరు టీ20 ఓటమి బాధలో వున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరోషాక్ తగిలింది. అతడు ప్రత్యర్థి బౌలర్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడన్న అంపైర్ల ఫిర్యాదుపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. తప్పును అంగీకరించడంతో అతడిని ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ ను చేర్చిన బెంగళూరు మ్యాచ్ రిఫరీ రిచర్డ్స్‌సన్ హెచ్చరించి వదిలేశాడు. దీంతో ఇప్పటికే కోహ్లీ ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లుండగా మరో డీమెరిట్ పాయింట్ కూడా చేరింది. 

 
టీ20 వరల్డ్ కప్ విజయానికి 12ఏళ్లు 

12 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు భారత క్రికెట్లో ఓ అద్భుతం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు 2007 సెప్టెంబర్ 24న టీ20 ఫార్మాట్ లో విశ్వవిజేతగా నిలిచింది. ఇలా యావత్ భారతావని సంబరాల్లో మునిగి తేలి 12 ఏళ్లు గడిచిపోయింది.  ఈ చారిత్రాత్మకమైన విజయన్ని అందించిన ఈ రోజు భారత క్రికెట్ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడింది.  ఈ వరల్డ్ కప్ విజయమే భారత క్రికెట్ ను మరోస్థాయికి తీసుకెళ్లింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  ఆనాటి మధుర క్షణాలు ఇంకా అభిమానుల మదుల్లో పదిలంగానే వున్నాయి. 

సౌతాఫ్రికాతో టెస్ట్ సీరిస్ కు బుమ్రా దూరం

ఇప్పటికే స్వదేశంలో టీ20 సీరిస్ ను సాధించలేక నిరాశతో వున్న టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా సౌతాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సీరిస్ కు దూరమయ్యాడు.  వెన్నునొప్పితో బాధపడుతున్న అతడికి ఈ టెస్ట్ సీరిస్ నుండి విశ్రాంతినివ్వాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. అతడి స్థానంలో మరో పేసర్ ఉమేశ్ యాదవ్ టీమిండియా తరపున టెస్ట్ సీరిస్ ఆడనున్నట్లు వెల్లడించింది. 

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పదవులన్నీ ఏకగ్రీవం

బిసిసిఐ అనుబంధ క్రికెట్ సంఘాల్లో ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు మాత్రం ఎన్నికలు జరగడంలేదు. ఎన్నికల ప్రక్రియ అవసరం లేకుండానే ఏసీఏ కార్యవర్గం ఏర్పాటయ్యింది. అధ్యక్ష పదవితో సహా మిగతా అన్ని పదవులకు కేవలం ఒక్కో అభ్యర్థే నామినేషన్ దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి భన్వర్ లాల్ వెల్లడించారు. దీంతో వారికే ఆ పదవులు కట్టబడుతూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

ఏసిఏ నూతన అధ్యక్షుడిగా పి. శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా యాచేంద్ర నియమితులయ్యారు. అలాగే కార్యదర్శిగా దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా రామచంద్రారావు, కోశాధికారిగా గోపీనాథ్ రెడ్డి, కౌన్సిలర్ గా ధనుంజయ్ రెడ్డి లు ఏకగ్రీవమయ్యారు.  

గ్రెటాపై రోహిత్ ప్రశంసలు
 
ఐక్యరాజ్యసమితి వేదికన పర్యావరణ పరిరక్షణకై గళమెత్తిన  గ్రేటా థన్‌బర్గ్ యావత్ ప్రపంచం నుండి ప్రశంసలు అందుకుంటోంది.  ఈ 16ఏళ్ల  బాలిక ఎలాంటి బెరుకు లేకుండా ప్రభుత్వాలు అభివృద్ది పేరుతో చేస్తున్న ప్రకృతి విద్వంసం గురించి ప్రశ్నించింది. ''హౌ డేర్ యూ'' అంటూ ఆమె చేసిన అద్భుత ప్రసంగం ఎంతమందిని కదిలించిందో తెలీదు కానీ టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మను మాత్రం కదిలించింది. దీంతో అతడు స్వీడన్ బాలికను ప్రశంసించకుండా వుండలేకపోయాడు. ఆ బాలికే తమకు ఆదర్శమని అతడు పేర్కొన్నాడు.


భారత క్రికెట్ కు మరో కుదుపు..బెట్టింగా వ్యవహారంలో కెపిఎల్ 

ప్రపంచ దేశాల ముందు భారత క్రికెట్ కు తలవంపు  తీసుకొచ్చే సంఘటన మరొకటి బయటపడింది. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక ప్రీమియర్ లీగుల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే భారీ బెట్టింగ్ కూడా సాగినట్లు తాజాగా బయటపడింది. ఈ లీగ్ బెళగావి పాంథర్స్ జట్టు యాజమాన్యం భారీ అవకతవకలకు పాల్పడినట్లు బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ జట్టు యజమాని అలీ అష్వాక్ బుకీగా మారి బెట్టింగ్ లకు పాల్పడ్డాడని గుర్తించి అరెస్ట్ చేయడంతో కలకలం రేగింది. 
 
హెచ్‌సీఏ ఎన్నికలు... కవితపై వివేక్ విమర్శలు
 
తెలంగాణ రాజకీయాల్లో ఏకచత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న కల్వకుంట్ల ఫ్యామిలీ ఇక క్రికెట్లోనూ అడ్డుగుపెట్టేందుకు సిద్దమైందట. ప్రస్తుతం బిసిసిఐ అనుబంధ సంఘాల్లో జరుగుతున్న ఎన్నికల ద్వారా క్రికెట్ లో కూడా రాజకీయాలు చేయాలన్నదే మంత్రి కేటీఆర్ ఆలోచన అని మాజీ హెచ్‌సీఏ అధ్యక్షులు జి. వివేక్ ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను తమ చెక్కుచేతల్లోకి తీసుకోవాలని టీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది.  అందుకోసమే కాంగ్రెస్ మాజీ ఎంపి,మాజీ  క్రికెటర్ అజారుద్దిన్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.  ముఖ్యంగా నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత కేంద్రంగా  ఈ రాజకీయాలు సాగుతున్నట్లు ఆరోపించాడు. 

బిజెపిలో చేరిన రెజ్లర్ యోగేశ్వర్ దత్

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుచేసి బంఫర్ మెజారిటీతో బిజెపి కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. ఇదే ఊపును ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా కొనసాగించాలని బిజెపి అధినాయకత్వం భావిస్తోంది. అందుకోసం వివిధ రంగాల్లో ఓవెలుగువెందిన మహారాష్ట్ర, హర్యానాలకు చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ ను పార్టీలోకి చేర్చుకుని హర్యానా ఎన్నికల బరిలోకి దించేందుకు బిజెపి రంగం సిద్దంచేస్తోంది. 

హెచ్‌సీఏ అధ్యక్షపీఠం అజార్ దే

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాజీ టీమిండియా కెప్టెన్ అజారుద్దిన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇవాళ(శుక్రవారం) జరిగిన ఎన్నికల్లో మొత్తం 223 ఓట్లు పోలవ్వగా అజార్ కు 144 ఓట్లు వచ్చాయి. దాదాపు సగానికి పైగా ఓట్లను దక్కించుకున్న అతడు  74 ఓట్ల తేడాతో విజయకేతనం ఎగరేశాడు. ప్రకటించారు. 

విజయనగరం ప్రాక్టీస్ మ్యాచ్ లో రోహిత్ డకౌట్...

వన్డే, టీ20 పార్మాట్ లో అతడో గొప్ప ఓపెనర్. తన బ్యాట్ నుండి పరుగుల వరద పారిస్తూ చాలా మ్యచుల్లో భారత్ కు శుభారంభాన్ని అందించాడు. ఇలా పరిమిత ఓవర్ల క్రికెట్లో స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు. కానీ టెస్ట్ ఫార్మాట్లో ఓపెనింగ్ మాట అంటుంచి కనీసం జట్టులో స్థిరమైన స్థానాన్ని సంపాదించలేకపోయాడు. కానీ తాజాగా ఆ ఫార్మాట్లో కూడా ఓపెనింగ్  చేసే అరుదైన అవకాశం అతడికి లభించింది. అక్టోబర్ 2 నుండి విశాఖపట్నం వేదికన ప్రారంభమయ్యే టెస్ట్ సీరిస్ లో రోహిత్ మొదటిసారి ఓపెనింగ్ చేయడానికి సిద్దమయ్యాడు. అయితే అంతకు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో అతడు ఓపెనింగ్ కు దిగి  ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం బంతులను  మాత్రమే ఎదుర్కొని పరుగులేమీ సాధించకుండానే డకౌటయ్యాడు. 

కొరియా ఓపెన్ నుండి కశ్యప్ ఔట్...సెమీఫైనల్లో ఓటమి

బీడబ్యూఎఫ్ కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ 500 టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ పారుపల్లి  కశ్యప్ పోరాటం ముగిసింది. వరుస విజయాలతో సెమీఫైనల్ వరకు చేరుకున్న అతడు పతకానికి అడుగు దూరంలో నిలిచిపోయాడు. సెమీస్ లో జపాన్ కు చెందిన నెంబర్ వన్, రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ కెంటో మొమొట చేతిలో కశ్యప్  ఓటమిపాలయ్యాడు. దీంతో అతడు ఈ టోర్ని నుండి వైదొలిగాడు.   21-13,21-15 తో పూర్తి ఆధిపత్యాన్ని కరబర్చిన కెంటో ఫైనల్ కు అర్హత సాధించాడు.   

రెజ్లింగ్ వరల్డ్ నెంబర్ వన్ గా దీపక్

భారత రెజ్లర్ దీపక్ పూనియా మరో అరుదైన ఘనత సాధించాడు. ఇటీవలే కజకిస్థాన్ వేదికన జరిగిన వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ లో రజతంతో మెరవడమే కాదు టోక్యో ఒలింపిక్స్ కు కూడా అర్హత సాధించిన విషయం తెలిసిందే. తాజాగా రెజ్లింగ్ వరల్డ్ ర్యాకింగ్స్ లో టాప్ లేపి ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడిగా నిలిచాడు. 86కిలోల విభాగంలో దీపక్ ఈ ఘనత సాధించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios