పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు మరింత దిగజారిని విషయం తెలిసిందే. ముఖ్యంగా మరికొద్దిరోజుల్లో జరగనున్న ప్రపంచ కప్ పై ఈ  ఉగ్రదాడి ప్రభావం పడింది. ఈ టోర్నీలో అత్యంత ఆదరణ కలిగిన భారత్-పాక్ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడినట్లు తేలింది. దీంతో ప్రపంచ కప్ లో పాక్ తో జరిగే మ్యాచ్ ను భారత్ నిషేధించాలని మాజీలు, అభిమానులు పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ డిమాండ్ ను సచిన్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. పాక్ తో మ్యాచ్ ఆడకుంటే భారత్ రెండు పాయింట్లు కోల్పోతుందని...అప్పుడు పాకిస్థాన్ మ్యాచ్ ఆడకుండానే గెలిచినట్లవుతుందని సచిన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ కప్ చరిత్రలో ఎప్పుడూ పాక్ పై భారతే పైచేయి సాధించిందని గుర్తుచేసిన సచిన్...అలా మరోసారి చిత్తుగా ఓడించే అవకాశాన్ని కోల్పోవద్దని సూచించారు. పాక్ తె మ్యాచ్ ను టీంఇండియా నిషేధిస్తే రెండు పాయింట్లు సమర్పించుకోవడం ద్వారా మనమే సాయం చేసినట్లు అవుతుందన్నారు.  

అయితే సచిన్ వ్యాఖ్యలపై తాజాగా టీంఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కాస్త ఘాటుగా స్పందించారు. సచిన్ కేవలం రెండు పాయింట్లు కోసమే చూస్తున్నాడని....కానీ తాను భారత్ ప్రపంచ కప్ ట్రోపీ అందుకోవాలని కోరుకుంటున్నట్లు గంగూలీ పేర్కొన్నాడు.  10 దేశాలు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ప్రతి జట్టు మిగతా దేశాలతో ఆడుతుందని అన్నారు. కేవలం ఒక్క మ్యాచ్ ను ఆడకుండా వుంటే భారత్ కు నష్టమేమీ వుండదంటూ గంగూలీ సచిన్ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. 

భారత్-పాక్ క్రికెట్ జట్లు ఇప్పటివరకు కేవలం ద్వైపాక్షిక సీరీస్ లకే దూరంగా వుండగా....పుల్వామా దాడితో ఐసిసి నిర్వహించే  అంతర్జాతీయ టోర్నీలపై కూడా ప్రభావం పడింది. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తూ  అశాంతికి కారణమవుతున్న పాకిస్థాన్ తో క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ కప్‌లో పాక్ తో జరగనున్న మ్యాచ్ ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ  డిమాండ్ కు కొందరు మాజీ ఆటగాళ్లు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.