భారత్ తరపున ఒలింపిక్స్ లో పాల్గొనాల్సింది... కానీ మిస్ అయ్యా : వరల్డ్ అథ్లెటిక్స్ చీఫ్ సెబాస్టియన్ కో
వరల్డ్ అథ్లెటిక్ చీఫ్ సెబాస్టియన్ కోతో ఆసియానెట్ న్యూస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రా ప్రత్యేక ఇంటర్వ్యూ.
world athletics head sebastian coe exclusive interview : ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో భారతదేశంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఏషియానెట్ తో మాట్లాడారు. ఆయనను ఏషియానెట్ న్యూస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రా ఇంటర్వ్యూ చేసారు. ఇందులో భారత్ తో తనకున్న అనుబంధం గురించి సెబాస్టియన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
గతంలో ఒలింపిక్స్‌లో భారత్‌కు అథ్లెట్‌గా ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించిందని సెబాస్టియన్ కో వెల్లడించారు. కొన్ని కారణాల వల్ల ఆనాడు భారత్‌కు ప్రాతినిధ్యం వహించలేకపోయానని చెప్పాడు. తన పూర్వీకులది భారత దేశమేనని... అందువల్లే తనకు ఆఫర్ వచ్చిందని తెలిపారు.
బ్రిటిష్ జట్టు నుండి తొలగించినప్పుడు భారత జాతీయ ఒలింపిక్స్ కమిటీ తనను సంప్రదించిందని సెబాస్టియన్ వెల్లడించారు. భారత్ తరపున ఒలింపిక్స్ కు ప్రాతినిధ్యం వహించాలని కోరారట. అయితే ఒక దేశం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు మరో దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే మూడు నుంచి ఐదేళ్ల వ్యవధి అవసరమని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, బ్రిటన్ ఒలింపిక్ కమిటీ తెలియజేసినట్లు ఆయన తెలిపారు. అందుకే భారత్ ఆఫర్‌ను అంగీకరించలేకపోయానని అన్నారు.
తనకు భారత్ అంటే ఇష్టమని సెబాస్టియన్ తెలిపారు. అందుకే తన బిడ్డ పేరులో ఇండియాను చేర్చినట్లు తెలిపారు. సెబాస్టియన్ కో కు నలుగురు సంతానం కాగా అందులో ఒకరికి ఆలిస్ ఇండియా వైలెట్ కో అని పేరు పెట్టారు.
ఇక అథ్లెటిక్స్ పై తనకున్న ఇష్టాన్ని బైటపెట్టారు సెబాస్టియన్ కో. అథ్లెటిక్స్, అడ్మినిస్ట్రేటర్‌లో ఏది ఎంచుకుంటానని అడిగినప్పుడు, రెండూ తనకు ఒకటేనని జవాబిచ్చారు. రెండింటినీ సమర్ధవంతంగా నిర్వర్తించే అన్ని అర్హతలు తనకు వున్నాయన్నారు. అథ్లెట్‌గా కేవలం ఆటలోనే కాదు జీవితంలోనూ చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నారు. అథ్లెట్ గా ఉన్నప్పుడు కమిట్మెంట్, నిబద్ధత ఏంటో అర్థం అవుతుందని... అసౌకర్యాలను అధిగమించడం, గాయాల నుండి కోలుకోవడం, ప్రపంచ స్థాయి కోచ్ లతో కలిసి పనిచేయడం వంటివి నేర్చుకున్నానని సెబాస్టియన్ తెలిపారు.
అయితే తాను అథ్లెట్‌గా కెరీర్ ప్రారంభించకముందు రాజకీయాల్లోకి రావాలనుకున్నానని సెబాస్టియన్ తెలిపారు. కానీ తర్వాత రాజకీయాల్లోకి కాకుండా అథ్లెటిక్స్ వైపు వచ్చినట్లు తెలిపారు. రాజకీయాల్లో ప్రతిరోజూ ఏదో ఒక రకమైన సంక్షోభంలో కూరుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని... తద్వారా ఒత్తిళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోగలమని సెబాస్టియన్ కో తెలిపారు. ప్రస్తుతం సెబాస్టియన్ కో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు.
పూర్తి ఇంటర్వ్యూ