న్యూఢిల్లీ: ఆసియా కప్ లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శనకు జట్టు తీవ్రమైన విమర్శలకు గురవుతోంది. సూపర్ ఫోర్ లో బంగ్లాదేశ్ పై తమ జట్టు ఓడిపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో షోయబ్ మాలిక్ పై ఓ జర్నలిస్టు చెత్త వ్యాఖ్య చేశాడు. 

పాకిస్థాన్ జర్నలిస్టు ఒకరు షోయబ్‌ను వెక్కిరిస్తూ ఓ ట్వీట్ చేశాడు. దానిపై షోయబ్ భార్య, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తీవ్రంగా స్పందించారు. దీంతో ఆ జర్నలిస్టు తన ట్వీట్‌ను దెబ్బకు డిలీట్ చేశాడు. నిజానికి, ఈ టోర్నమెంటులో షోయబ్ మాలిక్ ఫరవా లేదనిపించాడు.

"ఎవరైనా షోయబ్‌ను అడగండి సానియాను ఇంప్రెస్ చేశాడేమో? కనీసం తర్వాతి టోర్నమెంటులోనైనా జట్టు కోసం ఆడతాడేమో కనుక్కోండి. భార్యను సంతోషపరిచిన వ్యక్తి నుంచి దేశం ఇంకేమి ఆశిస్తుంది?" అని ట్వీట్ చేశాడు.
 
దానికి సానియా ఘాటుగా సమాధానం చెప్పింది. "అరే బేచారా.. చాలా అమాయకుడిలా కనిపిస్తున్నావు.. నువ్వో ప్రత్యేకమైన ఆసియా కప్‌ను చూస్తున్నట్టుంది" అని జవాబిచ్చింది. దీంతో అతను తను పెట్టిన ట్వీట్‌ను  డీలిట్ చేశాడు.