Asianet News TeluguAsianet News Telugu

హోస్ట్‌కి ఎన్ని అగచాట్లో.. 'ఆట' పోటుల్లో రష్యా..!

హోస్ట్‌కి ఎన్ని అగచాట్లో.. 'ఆట' పోటుల్లో రష్యా..!

Russia panic about host for FIFA

హైదరాబాద్: ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తున్న ఆనందాన్ని అగ్రదేశాలు రష్యాకు మిగలనివ్వడంలేదు. వరల్డ్ కప్ పోటీల నిర్వహణకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే రష్యా దాదాపు ఒంటరి పోరాటం చేస్తున్నది. గత కొద్ది సంవత్సరాలుగా అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు పుతిన్ పాలనలోని దేశాన్ని మిగతా ప్రపంచం ఏకాకిని చేసింది. అనేక ఆంక్షలు విధించింది. ఒలింపిక్స్‌లో డోపింగ్ టెస్ట్ వివాదం మాయని మచ్చగా మిగిలిపోయింది. వరల్డ్ కప్ ఆరంభ వేడుకలకు ముఖం చాటేసే దేశాల్లోనే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు అనివార్యంగా అవతరించే జాత్యహంకార వ్యాఖ్యలు, హింసాత్మక ఘటనలను ఎలా అడ్డుకోవాలనే అంశం హోస్ట్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.


ధూమ్‌ధామ్‌గా ఏర్పాట్లు
11 నగరాల్లో మిరుమిట్లుగొల్పుతున్న 12 స్టేడియాలు అద్భుతమైన మ్యాచ్‌లకు వేదికలుగా అవతరించడానికి తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. దేశంలోని భద్రతా బలగాలన్నీ ఈ నగరాలే పరిమితమయ్యాయా అన్న తీరుగా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ప్రపంచం నలమూలాల నుంచి వస్తున్న టీమ్స్‌ బస చేయడానికి ప్రత్యేకమైన స్పోర్ట్స్ విలేజ్‌లు రెడీగా ఉన్నాయి. ఫైవ్ స్టార్ హోటల్ స్థాయిలో ఉన్న సదుపాయాలు ఆటగాళ్ళను కచ్చితంగా ఆకట్టుకుంటాయని నిర్వాహకులు భావిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేని విధంగా పోటీలు జరిగే నగరాల్లో అడుగడుగునా సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటికి తోడుగా 24 గంటలు మానిటర్ చేసే కంట్రోల్ రూమ్‌లు ఎటూ ఉండనే ఉన్నాయి.


హోస్ట్ కావడానికి రష్యా లంచాల స్కామ్
ఇంగ్లండ్‌ను తోసిరాజని హోస్టింగ్ హక్కులు దక్కించుకోవడంలో రష్యా ముడుపులు చెల్లించిందనే ఆరోపణలో పశ్చిమ దేశాలు అధ్యక్షుడు పుతిన్ మీద అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. దీనికి తోడు రష్యా అవలంబిస్తున్న విదేశాంగ విధానం ఆయా దేశాలు పుండు మీద కారం చల్లినట్టుగా అయ్యింది.


ఆంక్షలు.. బహిష్కరణలు
రష్యా ఇతర అగ్ర దేశాలను దిక్కరించి మరీ ఉక్రెయిన్ నుంచి క్రిమియాను తనదిగా చేసుకుంది. అంతేకాక సిరియాలో బషర్ అల్ అస్సద్‌కు మద్దతుగా దాడులకు నాంది పలికింది. వీటికి తోడు రష్యా అధ్యక్షుడు పుతిన్ 2106 అమెరికా ఎన్నికలను ప్రభావితం చేశారని యుఎస్ నిఘా వర్గాలు గుడ్డిగా నమ్ముతున్నాయి. మాజీ డబుల్ ఏజెంట్ సెర్జీ క్రిపాల్‌కు రష్యా హత్య చేయించిందని బ్రిటన్ ఆరోపించింది. 


రష్యాపైన పడిన డోపింగ్ దుమారం ఆ దేశాన్ని ఒలింపిక్స్‌కు దూరం చేసింది. ఇతర దేశాలతో సంబంధాలను మరింత క్లిష్టపరిచింది.ఇంత జరుగుతున్నా కానీ దేశాధ్యక్షుడు పుతిన్ ఏ మాత్రం మనో నిబ్బరాన్ని కోల్పోడంలేదు. మొక్కవోని దీక్షతో వరల్ట్ కప్ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నారు. పోటీల్లో పాల్గొంటున్న 32 టీమ్‌లలో ఎక్కడో అగాధంలో ఉన్నతమ జట్టు సైతం గట్టి పోటీ ఇస్తుందని ధీమాగా చెబుతున్నారు. 

పుతిన్ ఆలోచనలకు తగ్గట్టుగానే క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ వేర్వేరు దేశాల అతిథులు వరల్డ్ కప్ ఆరంభ సంరంభానికి వెల్లువెత్తుతారని చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇంగ్లండ్ సహా కొన్ని తూర్పు ఐరోపా దేశాలు వరల్డ్ కప్ వేడుకలను బహిష్కరించడానికి సిద్ధమైపోయాయి. స్వీడన్, ఐస్‌ల్యాండ్ లాంటి దేశాలు సైతం ఇదే బాట పడుతున్నాయి.ఇన్ని రకాల అగచాట్ల మధ్య వరల్డ్ కప్ నిర్వహణలో రష్యా సత్తా ఏమిటో తెలుసుకోవాలంటే జూన్ 14 దాకా ఆగాల్సిందే మరి.

Follow Us:
Download App:
  • android
  • ios