Asia Cup: జపాన్ ను చిత్తు చేసిన భారత్.. కాంస్య పోరులో టీమిండియాదే విజయం
Asia Cup Hockey: యువ భారత్ సంచలనం సృష్టించింది. ఫైనల్ కు చేరే అవకాశాన్ని కోల్పోయినా మూడో స్థానం కోసం జరిగిన పోరులో టీమిండియా కుర్రాళ్లు సంచలన విజయాన్ని నమోదు చేశారు.
ఇండోనేషియాలోని జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా కప్ హాకీ-2022 లో భారత జట్టు కాంస్యం నెగ్గింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో యువ భారత్ అదరగొట్టింది. 1-0 తేడాతో జపాన్ ను చిత్తు చేసి కాంస్యం నెగ్గింది. బుధవారం జపాన్ తో హోరాహోరి పోరాడిన భారత జట్టు.. పట్టుదలతో ఆడి విజయాన్ని అందుకుంది. భారత్ తరఫున రాజ్ కుమార్ పాల్ ఆట ఏడో నిమిషంలో గోల్ కొట్టి భారత్ ను ఆధిక్యంలోకి తెచ్చాడు.
అనంతరం భారత్ కు పలు పెనాల్టీ కార్నర్ ల ద్వారా గోల్ కొట్టే అవకాశం వచ్చినా మన ఆటగాళ్లు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఆట తొలి క్వార్టర్ ముగుస్తుందనగా జపాన్ దాదాపు తొలి గోల్ కొట్టినంత పని చేసింది. కానీ భారత్ జపాన్ ఆటలు సాగనివ్వలేదు. భారత ఆటగాళ్లు జపాన్ గోల్ ఆశను సమర్థవంతంగా అడ్డుకున్నారు.
ఆట ముగుస్తుందనగా కూడా జపాన్ కు 48వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ లభించాయి. కానీ వాటిని గోల్స్ గా మలచడంలో జపాన్ విఫలమైంది. దీంతో భారత జట్టు 1-0 తేడాతో జపాన్ ను చిత్తు చేసి కాంస్యం నెగ్గింది.
అంతకుముందు మంగళవారం ముగిసిన సూపర్-4 లో భాగంగా టీమిండియా దక్షిణ కొరియాతో మ్యాచ్ లో 4-4 తో డ్రా గా ముగించిన విషయం తెలిసిందే. తప్పక గెలవాల్సిన చోట మ్యాచ్ ను డ్రా చేసుకోవడంతో మెరుగైన గోల్స్ తో దక్షిణ కొరియా ఫైనల్ కు చేరింది. జపాన్ ను ఓడించిన మలేషియా కూడా ఫైనల్ చేరింది. ఈ రెండు జట్లు నేటి సాయంత్రం ఫైనల్ లో తాడో పేడో తేల్చుకోనున్నాయి. బుధవారం మధ్యాహ్నం జరిగిన కాంస్య పోరులో భారత్ గెలిచి పతకం సాధించింది.