బ్రిస్టల్: ఇంగ్లాండుపై మూడో ట్వంటీ20 మ్యాచులో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ రోహిత్ శర్మను మరో క్రికెటర్ దినేష్ కార్తిక్ ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ చాలా ఆసక్తికరంగా సాగింది.  అంతకు ముందు దినేశ్ రోహిత్ భార్య రితికా సాజేద్ గురించి అడిగాడు. " రితికా ఉన్నప్పుడు నువ్వు అద్భుతంగా రాణిస్తావని అందరూ అనుకుంటారు. కానీ ఈ రోజు ఆమె నాకు ఎక్కడా కనిపించలేదు. కానీ నువ్వు ఈ సెంచరీని ఎలా సాధించావు?" అని కార్తిక్ నవ్వుతూ ఆడిగాడు. 

దీనికి రోహిత్ "నాకు తెలిసినంత వరకు ఆమె ఈ రోజు టీవీకి అతుక్కుపోయి ఉంటుంది. కొద్ది రోజుల్లో ఆమె ఇక్కడకు వస్తుంది.. అందుకోసం ఎదురుచూస్తున్నా. కానీ కచ్చితంగా ఆమె ఇండియాలో ఈ మ్యాచ్ చూసే ఉంటుంది. నాకు ఇంకా కొన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈలోపు ఆమె ఇక్కడకు వస్తే ఎంతో ఆనందం" అని జవాబిచ్చాడు..

మూడో మ్యాచ్ విజయం తర్వాత జట్టు వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ ఆ ఇంటర్వ్యూ చేశాడు. హిట్‌-మ్యాన్ అనే ముద్దు పేరు తనకు ఇష్టమా లేదంటే దాన్ని మార్చుకోవాలని అనిపిస్తోందా అని కార్తీక్ రోహిత్ ను ప్రశ్నించాడు.  "నిజంగా, నాకు హిట్‌మ్యాన్ పేరంటే ఎంతో ఇష్టం. అది నా పేరుని కూడా పోలి ఉంది. అది నాకు ఇష్టం" అని అన్నాడు.
 
ప్రస్తుత క్రికెటర్లలో రోహిత్ మాత్రమే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు, టీ-20ల్లో మూడు సెంచరీలు చేశాడు. మూడు టీ20 సెంచరీల్లో ఏదంటే ఇష్టమని కార్తిక్ అడిగితే  -అది చాలా కష్టమని, ఆ మూడు సెంచరీలు వేర్వేరు సందర్భాల్లో చేసినవని, దేని ప్రత్యేకత దానికి ఉందని అన్నాడు.

గతంలో అందరూ తనను తన మూడు డబుల్ సెంచరీల గురించి ప్రశ్నించేవారని, కానీ తాను ప్రత్యేకంగా దేన్నీ ఎంచుకోలేదని, ఒక క్రికెటర్‌కి తాను చేసిన సెంచరీల్లో ఒక దాన్ని ఎంచుకోవడం చాలా కష్టమని, ప్రతీ సెంచరీ ప్రత్యేకమైందేనని అన్నాడు.