టీం ఇండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కి మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి పలు సూచనలు చేశారు.  ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ ద్వారా ఆ ఫార్మాట్‌లో రిషబ్ పంత్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కాగా.. అతని ఆట ఇంకా మెరుగుకావాల్సి ఉందని  సయ్యద్ కిర్మాణి అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం  రిషబ్‌ కీపింగ్‌ టెక్నిక్‌ అంత మెరుగ్గా లేదన్న కిర్మాణి..ఇంకా అతను నేర్చుకునే దశలోనే ఉన్నాడన్నాడు. ఈ క్రమంలోనే ఎంఎస్‌ ధోని కీపింగ్‌ టెక్నిక్‌ను కాపీ కొట్టొద్దని సూచించాడు.  వికెట్ల వెనకాల అత్యుత్తమంగా ఉండటం ఎంత అవసరమో ధోని నిరూపించాడన్నారు. యువకులు ధోనిని బ్యాటింగ్‌, కీపింగ్‌ విభాగాల్లో ఆదర్శంగా తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నాడు. కాగా, ధోని ఒక అరుదైన, ప్రత్యేకమైన వికెట్‌ కీపర్‌గా అభివర్ణించిన కిర్మాణి.. ఎట్టిపరిస్థితుల్లోనూ ధోనిని పంత్‌ అనుసరించకపోవడమే ఉత్తమం అన్నాడు.

‘వికెట్‌ కీపింగ్‌లో ప్రాథమిక పరిజ్ఞానం చాలా అవసరం. బ్యాటింగ్‌ పరంగా పంత్‌ బాగున్నాడు. వికెట్‌ కీపింగ్‌లో బంతులు అందుకునేందుకు కచ్చితమైన టెక్నిక్‌, చురుకుదనం, చక్కని చూపు అవసరం. కీపింగ్‌లో పంత్‌ చాలా మెరుగుపడాలి. స్పిన్‌ బౌలింగ్‌లో బౌలర్‌ టర్న్‌ తీసుకొనే వరకు పంత్‌ కూర్చొని ఉండాలి. బంతి పిచ్‌ అయి ఎటువెళ్తుందో చూసే వరకు కూర్చొని ఉండాలి. ఆ తర్వాత స్వింగ్‌, బౌన్స్‌కు అనుగుణంగా కదలాలి. ప్రధానంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో కీపర్‌ ఎప్పుడు లేస్తున్నాడన్న దానిపైనే అతడి సామర్థ్యం ఏంటో తెలుస్తుంది’ అని కిర్మాణీ అన్నాడు.

అయితే పంత్‌ ఫీల్డర్లు విసిరిన బంతిని అందుకునేందుకు ధోనిని అనుకరించడాన్ని కిర్మాణి తప్పుబట్టాడు. ‘ఫీల్డర్లు బంతిని విసిరే సమయంలో ధోని వికెట్ల ముందు నిలబడి బంతి అందుకుంటాడు.  ధోని అరుదైన వికెట్‌ కీపర్‌. అతనిలో ఒక ప్రత్యేకత ఉంది. వికెట్ల వెనకాల అత్యుత్తమంగా ఎలా ఉండాలో ధోని నిరూపించాడు. ఇప్పుడు  పంత్‌ ఫీల్డర్లు విసిరిన బంతిని అందుకొనేందుకు ధోనిని అనుకరిస్తున్నాడు. ఎప్పుడైనా సరే వికెట్ల వెనకాల ఉండి బంతిని అందుకోవడం సరైన పద్ధతి. ఇది టెక్నిక్‌ కాదు. నియమం. అప్పుడే కీపర్‌ కంటి స్థాయి బెయిల్స్‌ను చూసేందుకు, బంతి ఎక్కడ పిచ్‌ అవుతుందో తెలుసుకునేందుకు సులభంగా ఉంటుంది’అని కిర్మాణి తెలిపాడు.