రియల్ మాడ్రిడ్‌పై జంట కష్టాలు.. ఇటు జిడానె.. అటు రొనాల్డో ఔట్?

Real Madrid coach Zinedine Zidane drops Madrid bombshell
Highlights

 రియల్ మాడ్రిడ్‌పై జంట కష్టాలు.. ఇటు జిడానె.. అటు రొనాల్డో ఔట్?  

మాడ్రిడ్: స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ ‘లా లీగ’ దిగ్గజం, మూడేళ్లుగా చాంపియన్స్ లీగ్ చాంపియన్ ‘రియల్ మాడ్రిడ్’ జంట కష్టాల్లో పడింది. వరుసగా మూడేళ్లు విజయం సాధిస్తున్న రియల్ మాడ్రిడ్ జట్టుకు కష్టాలు మొలయ్యాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే జట్టు నుంచి వైదొలుగనున్నట్లు స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ప్రకటించాడు.. తాజాగా కోచ్.. అందునా 2020 వరకు కాంట్రాక్ట్ ఉన్నా తక్షణం వైదొలుగుతున్నట్లు రియల్ మాడ్రిడ్ మేనేజర్ జినెడినె జిడానె గురువారం ప్రకటించారు. మూడేళ్లుగా జట్టు విజయాలను సాధించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న కోచ్ జినెడినె జిడానే (45) ఆశ్చర్యకరమైన రీతిలో ఈ ప్రకటన చేశాడు.

రొనాల్డో నిర్ణయంతో ముడి పెట్టొద్దన్న జిడానె
రియల్ మాడ్రిడ్ జట్టు నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన చేసిన ప్రకటన ఆ జట్టుపై బాంబు వంటిదే. చాంపియన్స్ లీగ్ టోర్నీలో వరుసగా మూడో ఏడాది చాంపియన్ షిప్ సాధించిన సంబురాలను ఇంకా రియల్ మాడ్రిడ్ జరుపుకుంటుండగానే తనకు తాను క్లబ్ మారాల్సిన పరిస్థితి ఆసన్నమైందని సంకేతాలిచ్చాడు. రియల్ మాడ్రిడ్ జట్టు విజయగాథను మరింత ముందుకు తీసుకెళ్లగల సామర్థ్యం తనకు లేదని అంగీకరించాడు జిడానె. కానీ తన నిర్ణయానికి, క్రిస్టియానో రొనాల్డో వైదొలగాలన్న ఆలోచనకు ముడిపెట్టొద్దని జిడానె కోరాడు.
 

తన నిర్ణయంలో మరే క్లబ్ ప్రమేయం లేదు
కానీ రియల్ మాడ్రిడ్ జట్టు నుంచి వైదొలగడంలో మరే క్లబ్ ప్రమేయం లేదని తేల్చి చెప్పాడు. అయితే ఫ్రాన్స్ జాతీయ జట్టు కోచ్‌గా జినెడినె జిడానే బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయని సాకర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ తాను ఏ ఇతర ఆప్షన్ కోసం ఎదురు చూడటంగానీ, ప్రయత్నించడం గానీ చేయడం లేదని జిడానె తేల్చి చెప్పాడు. వచ్చే సీజన్‌ నుంచి రియల్ మాడ్రిడ్ జట్టు మేనేజర్ బాధ్యతల్లో కొనసాగాలని తాను భావించడం లేదని హడావుడిగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ చెప్పాడు. 
 

రియల్ మాడ్రిడ్ జట్టుకు మరో కోచ్ అవసరం 
‘ఈ క్లబ్ ఇక ముందు విజయాలను సాధించాలని భావిస్తే మార్పు చేయాల్సిన అవసరం ఉంది’ అని జినెడినె జిడానె పేర్కొన్నాడు. తాను వైదొలుగాల్సిన అవసరం ఉందన్నాడు. మూడేళ్ల తర్వాత ఒక క్లబ్ జట్టుకు మరొకరి పద్దతిని నేర్చుకోవాల్సి ఉందన్నాడు. మరో కోచ్ పర్యవేక్షణ, పద్ధతిలో పని చేయాల్సి ఉంటుందని జిడానె తేల్చి చెప్పాడు. 
 

2020 వరకు రియల్ మాడ్రిడ్‌తో జిడానె కాంట్రాక్ట్
ఇకముందు అన్ని రకాల విజయాలు సాధించే దిశగా జట్టులో స్ఫూర్తిని నింపలేనని తేల్చి చెప్పాడు. ‘నాకుగా నేను ఈ సంవత్సరాన్ని గెలుచుకోవాలని భావిస్తున్నా. నేను ఒక విజేతను. దాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేను’ అని జిడానె అన్నాడు. కానీ రియల్ మాడ్రిడ్ జట్టు యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం జిడానె కాంట్రాక్ట్ 2020 వరకు ఉంది. 
 

లోతుగా ఆలోచించాకే ఈ నిర్ణయమన్న జిడానె
చాలా లోతుగా ఆలోచించిన తర్వాత తీసుకున్న నిర్ణయం నుంచి వెనుకడుగు వేసే అవకాశమే లేదని తేల్చి చెప్పాడు. గత శనివారం కీవ్‌లో జరిగిన చాంపియన్స్ షిప్ లీగ్ టైటిల్ పోరులో లివర్ పూల్ జట్టును రియల్ మాడ్రిడ్ జట్టు 3 - 1 స్కోర్ తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. రియల్ మాడ్రిడ్ జట్టు వరుసగా చాంపియన్స్ షిప్ లీగ్ గెలుచుకోవడంలో జినెడినె జిడానె కోచ్‌గా కీలకంగా వ్యవహరించాడు. రియల్ మాడ్రిడ్ జట్టుకు వరుసగా మూడు చాంపియన్స్ లీగ్ టైటిళ్లు తెచ్చి పెట్టిన తొలి కోచ్‌గా  జిడానె నిలిచాడు. 
 

జిడానే నిర్ణయం అనూహ్యమన్న పెరెజ్
జినెడినె జిడానెతోపాటు మీడియా సమావేశంలో పాల్గొన్న రియల్ మాడ్రిడ్ అధ్యక్షుడు ఫ్లోరెంటినో పెరెజ్.. మేనేజర్ నిర్ణయం, ప్రకటన పూర్తిగా అనూహ్యం అని పేర్కొన్నాడు. 2016 జనవరిలో బెంటిజెన్‌ను ఉద్వాసనకు గురైనప్పుడు జట్టుకు శాశ్వత కోచ్‌గా జిడానె ‘స్టికింగ్ ప్లాస్టర్’గా నిలిచాడని పెరెజ్ అన్నాడు. ‘రియల్ మాడ్రిడ్ క్లబ్ ఆయన ఇల్లుగానే ఉంటుంది. ప్రతి విజయంలోనూ ఆయన పాత్ర ఉంది. ఆయన నిబద్ధతకు ధన్యవాదాలు. ఆయన తిరిగి మా జట్టులో చేరతారనడంలో సందేహం లేదు. శాశ్వత కోచ్ గా నియమితులైనప్పటి నుంచి ఆటగాళ్లలో విశ్వాసం నింపిన జిడానె వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో ఈ రోజు చాలా విచారకరమైన రోజు అని అన్నాడు. రియల్ మాడ్రిడ్ కీలక ఆటగాడిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన క్రిస్టియానా రొనాల్డోతో తనకు సంబంధం లేదని కోచ్ జినెడినె జిడానె చెప్పాడు. 

loader