ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో  వరల్డ్ నెం.1 నార్వే చెస్ గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను చిత్తుగా ఓడించిన 16 ఏళ్ల  ప్రజ్ఞానంద...

ఆటల్లో చదరంగం తీరే వేరు. భారతీయులు కనిపెట్టిన ఈ ఆటలో ఆటగాడి తెలివి, ముందుచూపే ప్రమాణం. మిగిలిన ఆటల్లో ఎలా ఉన్నా చెస్‌లో భారతీయుల ఆధిక్యం ఏళ్ల పాటు కొనసాగింది, కొనసాగుతోంది... తాజాగా 16 ఏళ్ల భారత గ్రాండ్ మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద, వరల్డ్ నెం.1 మాగ్నస్ కార్ల్‌సెన్‌కు ముచ్ఛెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాగించాడు...

ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ టోర్నీమెంట్‌లో భాగంగా సోమవారం వరల్డ్ నెం.1 నార్వే చెస్ గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను చిత్తుగా ఓడించాడు భారత యంగ్ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద్...

నల్ల పావులతో ఆడుతూ 39 ఎత్తుల్లోనే మాగ్నస్‌ కార్ల్‌సెన్‌కి చెక్ మేట్ పెట్టేశాడు. ఈ విజయంతో 8 పాయింట్లు సాధించిన ప్రజ్ఞానంద 12వ ర్యాంకుకు చేరుకున్నాడు.అంతకముందు అర్మేనియా అమెరికా చెస్ గ్రాండ్ మాస్టర్, 39 ఏళ్ల లెవాన్ అరోనియన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద... రెండు గేమ్‌లను డ్రా చేసుకోగలిగాడు...

నాలుగేళ్ల క్రితం 2018లో 12 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి, భారత లెజెండరీ చెస్ ప్లేయర్ విశ్వనాథ్ ఆనంద్ రికార్డును బద్దలు కొట్టాడు రమేశ్‌బాబు ప్రజ్ఞానంద. విశ్వనాథన్ ఆనంద్‌కి 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సొంతం కాగా, ప్రజ్ఞానంద 12 ఏళ్ల వయసులోనే ఆ రికార్డును బ్రేక్ చేసేశాడు...

Scroll to load tweet…

వరల్డ్ నెం.1 చెస్ ప్లేయర్‌ను ఓడించిన ప్రజ్ఞానందను ట్వీట్ ద్వారా అభినందించాడు భారత మాజీ క్రికెటర్, ‘భారతరత్న’ సచిన్ టెండూల్కర్. 16 ఏళ్ల వయసులో వరల్డ్ నెం.1ని ఓడించడం, అదీ బ్లాక్స్‌తో ఆడుతూ గెలవడం ఓ మ్యాజికల్ విన్ అంటూ ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్, ఇండియాను గర్వించేలా చేసినందుకు అభినందించాడు.

తమిళనాడులోని చెన్నైలో 2005లో జన్మించిన రమేశ్‌బాబు ప్రజ్ఞానంద, ఓవరాల్‌గా ప్రపంచంలోనే అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన ఐదో చెస్ ప్లేయర్. 2013లో అండర్ 8 వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన ప్రజ్ఞానంద, ఏడేళ్ల వయసులో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ మాస్టర్ టైటిల్ సాధించాడు...

10 ఏళ్ల 10 నెలల 19 రోజుల వయసులో ఇంటర్నేషనల్ మాస్టర్‌గా నిలిచిన ప్రజ్ఞానంద, తన వయసు కంటే రెట్టింపు అనుభవం ఉన్న చందరంగ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తూ విశ్వ వేదికపై దూసుకుపోతున్నాడు...

రమేశ్‌బాబు ప్రజ్ఞానంద అక్క వైశాలి రమేశ్‌బాబు కూడా చెస్ ప్లేయరే. అండర్ 12, అండర్ 14 వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచిన వైశాలి రమేశ్‌బాబు, 2016లో వుమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సాధించింది...