కామన్వెల్త్ గేమ్స్ 2022: స్వర్ణం గెలిచిన పీవీ సింధు... ఫైనల్ మ్యాచ్‌లో ఘన విజయం..
కామన్వెల్త్ గేమ్స్ 2022: వరుస సెట్లు గెలిచి ఫైనల్‌ని ముగించిన పీవీ సింధు... భారత్ ఖాతాలో 19 స్వర్ణాలు...
కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆఖరి రోజు భారత్ ఖాతాలో మరో స్వర్ణాన్ని చేర్చింది తెలుగు తేజం పీవీ సింధు. సింధు విజయంతో కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత స్వర్ణాల సంఖ్యను 19కి చేరింది. బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు, తన ప్రత్యర్థి కెనడాకి చెందిన మిచెల్ లీని 21-15, 21-13 తేడాతో వరుస సెట్లలో విజయం అందుకుని మ్యాచ్‌ని సునాయాసంగా ముగించింది...
మొదటి గేమ్‌ని 21-15 తేడాతో గెలిచిన పీవీ సింధు, రెండో గేమ్‌లోనూ అదే దూకుడు చూపించింది. 21-13 తేడాతో రెండో గేమ్‌ని మ్యాచ్‌ని ముగించేసింది. వరల్డ్ నెం. 13 ర్యాంకర్ మిచెల్ లీని గత ఆరు మ్యాచుల్లో ఓడించిన పీవీ సింధు, అదే దూకుడుని కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్‌లోనూ చూపించింది.
2014 కామన్వెల్త్ గేమ్స్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మిచెల్ లీ చేతుల్లో పరాజయం పాలైన పీవీ సింధు, ఆ ఏడిషన్‌లో కాంస్య పతకం గెలిచి సరిపెట్టుకుంది. 2014 గాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో వుమెన్స్ సింగిల్స్‌లో కాంస్యం, 2018 గోల్డ్ కోస్ట్‌లో రజతం గెలిచిన పీవీ సింధుకి సింగిల్స్‌లో ఇదే మొట్టమొదటి కామన్వెల్త్ స్వర్ణం. 2018 మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన పీవీ సింధు, ఈసారి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రజతం గెలిచింది. మొత్తంగా కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకి ఇది ఆరో మెడల్. ఇందులో మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్య పతకం ఉన్నాయి.
పీవీ సింధు మెడల్‌తో కలిపి భారత్, కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో 200 స్వర్ణ పతకాలను పూర్తి చేసుకుంది. ఈ ఎడిషన్‌లో 19 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్య పతకాలతో మొత్తంగా 56 పతకాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది భారత్. ఐదో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఖాతాలో కూడా సరిగ్గా 19 స్వర్ణాలు ఉన్నాయి. కివీస్ మరో స్వర్ణం నెగ్గితే భారత్ మళ్లీ ఐదో స్థానానికి పడిపోనుంది...
2018 కామన్వెల్త్ గేమ్స్‌లో మూడో స్థానంలో నిలిచిన భారత్, ఈసారి ఆ ప్లేస్‌ని దక్కించుకోవాలంటే ఆఖరి రోజు 7 స్వర్ణాలు నెగ్గాల్సి ఉంటుంది. అయితే చివరి రోజు కేవలం ఐదు ఈవెంట్లలో మాత్రమే పసిడి పతకం కోసం పోటీపడుతున్నారు భారత అథ్లెట్లు. దీంతో 2022 కామన్వెల్త్ గేమ్స్‌ను నాలుగో స్థానంలో లేదా ఐదో స్థానంలో ముగించనుంది భారత్...