2017 ఓటమి... ఒకుహురాపై ప్రతీకారం తీర్చుకున్న సింధు
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పివి సింధు మరోసారి చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో జపాన్ క్రీడాకారినిపై తిరుగులేని ఆధిక్య ప్రదర్శించి గోల్డ్ మెడల్ సాధించింది.
స్విట్జర్లాండ్ వేదికన జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ లో పివి సింధు చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. జపాన్ కు చెందిన మూడో సీడ్ షట్లర్ నొజోమీ ఒకుహురాను ఫైనల్ పోరులో సింధు చిత్తుచేసింది. దీంతో ఈ 24ఏళ్ల యువతి మరో ప్రతిష్టాత్మక టోర్నీ విజయాన్ని సాధించింది. గత ఐదేళ్ల కష్టానికి సింధుకు సరైన ప్రతిఫలం లభించింది.
వరుసగా 2013 నుండి ఇప్పటివరకు సింధు వరల్డ్ ఛాంపియన్‌షిప్ లో నాలుగు పతకాలను గెలుచుకుంది. అయితే ఎప్పుడు కూడా ఫైనల్ విజేతగా నిలవలేకపోయింది. ఈసారి ఆ ముచ్చటను కూడా పూర్తిచేసుకుంది. 2013 వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో సింధు మొదటిసారి రజత పతకాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా వరుసగా 2014లో రజతం, 2017లో సిల్వర్, 2018లోనూ సిల్వర్ పతకాలను గెలుచుకుంది.
2017 ఫైనల్లోనూ ఫైనల్ కు చేరిన సింధు ఇదే ప్రత్యర్థి ఒకుహురా చేతిలో ఓటమిపాలయ్యింది. దాదాపు 110 నిమిషాల పాటు సాగిన అప్పటి సుధీర్ఘ ఫైనల్ మ్యాచ్ లో సింధు చివరివరకు పోరాడింది. అయితే చివరకు ఒకుహురా చేతిలో ఓటమిని అంగీకరించి సిల్వర్ తో సరిపెట్టుకుంది. ఇలా సింధు రెండేళ్లక్రితమే తృటిలో గోల్డ్ ను మిస్సయ్యింది.
కానీ మళ్లీ అదే ప్రత్యర్థిని 2019 బ్యాడ్మింటన్ ఫైనల్లో ఓడించి సింధు ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్ ను సింధు ఎంత కసితో మొదలుపెట్టిందో అంత కసితోనే ముగించింది. ప్రత్యర్థి కనీసం పోటీలోనే లేకుండా చేసి వరుస సెట్లలో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాధించింది. ఇలా తనకు 2017 లో ఎదురైన పరాభవానికి సింధు ఈ ఫైనల్లో ప్రతీకారం తీర్చుకుంది.
ఇలా వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ గెలిచిన ఏకైక భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఈ ఛాంపియన్ షిప్ లో అత్యధిక పతకాలు సాధించిన షట్లర్ గా నిలిచింది. ఒలింపిక్ లో సిల్వర్ విజయం తర్వాత సింధు సాధించిన ప్రతిష్టాత్మక విజయాల్లో ఈ గోల్డ్ మెడల్ మరింత ప్రత్యేకమైనది. ఈ మెడల్ ని తన తల్లికి అంకితమిస్తున్నట్లు సింధు ప్రకటించింది.
సంబంధిత వార్తలు
చరిత్ర సృష్టించిన పీవి సింధు...వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో ఘన విజయం