సింధు పరాజయాల పరంపర: కారణాలు ఇవే...

ఒలింపిక్స్‌లో తొలి రజతం, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో తొలి స్వర్ణం, వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ విజయంతో సింధు స్టార్‌డమ్‌ ఆకాశాన్నంటింది. మెగా టోర్నీల్లో మెగా జోరు చూపించే సింధు అగ్రశ్రేణి షట్లర్‌గా దారుణ పరాభవాలు మాత్రం చవిచూడలేదు. క్వార్టర్స్‌కు ముందు నిష్క్రమించిన సందర్భాలు ఉన్నా వాటిని తడబాటుగానే చూశాం. వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత సింధు తడబాటు అలవాటుగా మారింది!. టోక్యో ఒలింపిక్స్‌ సమీపిస్తున్న తరుణంలో సింధు ఫామ్‌ కలవర పెడుతోంది.

PV sindhu serial failures: the reasons behind

భారత బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్‌ తిరుగులేని స్టార్‌. లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పథకంతో  బ్యాడ్మింటన్‌ స్థాయిని పెంచిన అగ్రశ్రేణి షట్లర్‌. 

ఇక ఇదే స్థాయిలో ఒక మాటకొస్తే సైనా నెహ్వాల్ కన్నా ఎక్కువగా భారత ప్రజల అభిమానం చూరగొన్న మరో స్టార్ షట్లర్ సింధు. రియో ఒలింపిక్స్‌లో రతజంతో భారత బ్యాడ్మింటన్‌లోనే కాదు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సర్క్యూట్‌లోనే సూపర్‌స్టార్‌గా ఎదిగిన క్రీడాకారిణి పి.వి సింధు. 

ఒలింపిక్స్‌లో తొలి రజతం, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో తొలి స్వర్ణం, వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ విజయంతో సింధు స్టార్‌డమ్‌ ఆకాశాన్నంటింది. మెగా టోర్నీల్లో మెగా జోరు చూపించే సింధు అగ్రశ్రేణి షట్లర్‌గా దారుణ పరాభవాలు మాత్రం చవిచూడలేదు. 

క్వార్టర్స్‌కు ముందు నిష్క్రమించిన సందర్భాలు ఉన్నా వాటిని తడబాటుగానే చూశాం. వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత సింధు తడబాటు అలవాటుగా మారింది!. టోక్యో ఒలింపిక్స్‌ సమీపిస్తున్న తరుణంలో సింధు ఫామ్‌ కలవర పెడుతోంది.

Also read: వరల్డ్ టూర్ ఫైనల్స్.... ముగిసిన పీవీ సింధు కథ

భారత క్రీడా రంగంలో ఒక్క మెడల్‌తో దేశవ్యాప్తంగా రోల్‌మోడల్‌గా ఎదిగిన అరుదైన ప్రస్థానం పి.వి సింధు. బీజింగ్‌ ఒలింపిక్స్‌లో అభినవ్‌ బింద్రా స్వర్ణం సాధించినా.. రెజ్లింగ్‌లో సుశీల్‌ కుమార్‌, యోగేశ్వర్‌ దత్‌లు వరుస ఒలింపిక్‌ పతకాలు సాధించినా, మేరీకోమ్‌ ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచినా సింధు స్టార్‌డమ్‌ను మాత్రం అందుకోలేదు. 

రియో ఒలింపిక్స్‌లో సింధు మెడల్‌ సాధించే సమయానికి ప్రత్యేక పరిస్థితులు అందుకు ఓ కారణమైనా.. బ్యాడ్మింటన్‌ కోర్టులో దూకుడుగా చెలరేగుతూ స్మాష్‌లతో ప్రత్యర్థుల కోర్టులపై విరుచుకుపడిన సింధును చూసి అభిమానించని వారు లేరు అనటం అతిశయోక్తి కాదు. 

ప్రత్యర్థులపై ఎదురుదాడి ప్రధాన ఆయుధంగా మలుచుకున్న సింధు.. తర్వాత కాలంలోనే అదే అస్త్రంతో అగ్రశ్రేణి షట్లర్‌గా నిలదొక్కుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌ తర్వాత అగ్రశ్రేణి షట్లర్ల జాబితాలోకి వచ్చిన సింధు స్టార్‌ క్రీడాకారిణిగా అంచనాలను అందుకోవటంలో విజయవంతమైంది. 

2016 రియో ఒలింపిక్స్‌లో సిల్వర్‌ మెడల్‌ తర్వాత.. వరుసగా మెగా టోర్నీల్లో సింధు సిల్వర్‌తోనే సరిపెట్టుకున్నది. వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లలో సైతం 2017, 2018లలో రజతంతో మాత్రమే సరిపెట్టుకుంది. 

దీంతో సింధుపై సిల్వర్‌ స్టార్‌ ముద్ర పడింది. 2018 బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో అద్భుత విజయం సాధించిన సింధు కెరీర్‌లో తొలి మెగా స్వర్ణం సొంతం చేసుకుంది. ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌లో విజేతగా నిలిచి మరో రికార్డు సాధించింది. 

వరుసగా రెండు మెగా విజయాలతో 2020 టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణానికి సింధు బలమైన పోటీదారుగా నిలిచింది. ఈ అంచనాలు అన్నీ ఆగస్టు వరకే!. ఇప్పుడు కథ పూర్తిగా భిన్నం!.

కలవరపెడుతున్న వరుస ఓటములు... 

బెసెల్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సింధు తనదైన శైలిలో వరల్డ్‌ చాంపియన్‌గా అవతరించింది. టోర్నీలో తలపడిన షట్లర్లు అందరిపైనా సింధు ఆధిపత్యం చెలాయించింది. టైటిల్‌ పోరులోనూ స్పష్టమైన ఆధిక్యంతో కండ్లుచెదిరే విజయం సొంతం చేసుకుంది. 

వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ విజేతగా సింధు కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అందుకుంది. కానీ ఆ తర్వాత జరిగిన ఆరు బిడబ్ల్యూఎఫ్‌ టోర్నీలలో సింధు దారుణంగా విఫలమైంది. ఆ ఆరు టోర్నీలలో ఒక్క ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మాత్రమే సింధు ఫైనల్స్‌కు చేరగల్గింది. 

చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌, కొరియా ఓపెన్‌, డెన్మార్క్‌ ఓపెన్‌, చైనా ఓపెన్‌, హాంగ్‌కాంగ్‌ ఓపెన్‌లలో సింధు తొలి, రెండో రౌండ్లలోనే పరాజయాన్ని పలకరించింది. తాజాగా బిడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో వరుస ఓటములతో మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

Also read: రితికకు రోహిత్ శర్మ ఉద్వేగభరితమైన సందేశం

మహిళల సింగిల్స్‌ గ్రూప్‌-ఏలో అకానె యమగూచి (జపాన్‌)తో 21-18, 18-21, 8-21తో మూడు గేముల మ్యాచ్‌లో ఓడిపోయింది. చైనా షట్లర్‌ చెన్‌ యుఫెరుతో మ్యాచ్‌ను 22-20, 16-21, 12-21తో కోల్పోయింది. 

రెండు వరుస ఓటములతో వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో ర్యాంకింగ్స్‌లో అగ్రశ్రేణి ఎనిమిది మంది షట్లర్లు పోటీపడతారు. ఈ ఏడాది సింధు వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించలేదు. అయినా, డిఫెండింగ్‌ చాంపియన్‌గా సింధుకు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ లభించింది.


కోచ్  కిమ్‌ నిష్క్రమణే కారణమా...?

సాధారణంగా ఓ ఏడాదిలో వరుసగా వైఫల్యాలు పెద్ద విషయం కాదు. ప్రొఫెషనల్‌ కెరీర్‌లో స్టార్‌ క్రీడాకారులకు ఇది సహజమే. సైనా నెహ్వాల్‌ భీకర ఫామ్‌లో ఉన్న సమయంలోనూ ఆమెనూ ఇటువంటి ఓటములు వెక్కిరించాయి. 

మెన్స్‌ సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌దీ ఇదే పరిస్థితి. కానీ 2020 టోక్యో ఒలింపిక్స్‌కు గడువు సమీపిస్తోంది. ఈ సమయంలో భారత స్టార్‌ హంటర్‌ పి.వి సింధు ఫామ్ ఆందోళనకరంగా మారింది. బ్యాడ్మింటన్‌ కోర్టులో సింధు ప్రదర్శన తిరోగమనానికి ఆమె వ్యక్తిగత కోచ్‌ కిమ్‌ జి హ్యూన్‌ (దక్షిణ కొరియా) తప్పుకోవటమే కారణమనే వాదన వినిపిస్తోంది.

కిమ్‌ జి హ్యూన్‌ వ్యక్తిగత కోచ్‌గా ఉన్న సమయంలోనే సింధు వరల్డ్‌ చాంపియన్‌గా అవతరించింది. వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ సాధించింది. చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌పై ఒత్తిడి పెరగటం.. భారత స్టార్‌ ప్లేయర్స్‌ అందరూ గోపీచంద్‌ పర్యవేక్షణలోనే కొనసాగటం సింధుపై ప్రత్యేక దృష్టి సారించేందుకు వీలు లేకుండా చేస్తోంది. 

కిమ్‌ జి హ్యూన్‌ భర్త అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా.. ఆ సమయంలో భర్తకు తోడుగా ఉండేందుకు కిమ్‌ జి హ్యూన్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకుంది. కిమ్‌ జి నిష్క్రమించిన తర్వాత సింధు ప్రదర్శన పేలవంగా తయారయ్యింది.  

ఒక్క మాటలో సింధుకు ఇది సంక్షోభ సమయం. టోక్యో ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని కోచ్‌ గోపీచంద్‌, సింధులు ఈ సంక్షోభ గండాన్ని గట్టెక్కేందుకు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. క్రీడాకారుల జీవితంలో గెలుపోటములు, ఎత్తు పల్లాలు అత్యంత సహజం. కానీ ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసిస్తోన్న సమయంలో అనూహ్యంగా ఫామ్‌ కోల్పోయి తడబాటును అలవాటుగా చేసుకోవటం మాత్రం స్వయంకృతాపరాధమే అవుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios