ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో వరుస ఓటములతో సతమతమవుతూ పాయింట్స్ టేబుల్ చివరన నిలిచిన తెలుగు టైటాన్స్ కు కాస్త ఊరట లభించింది. బెంగళూరు కంఠీరవ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ జట్టు తమిళ్ తలైవాస్ ని చిత్తుచేసింది. తలైవాస్ స్టార్ రైడర్ అమిత్ 14పాయింట్లతో అదరగొట్టినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఐదు పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్ గెలుపు బావుటా ఎగరేసింది. 

టైటాన్స్ ఆటగాళ్లలో సిద్దార్థ్ దేశాయ్ 9, వికాస్ భరద్వాజ్ 6, ఫర్హాద్ 5, రజనీశ్ 4 పాయింట్లతో రాణించారు. అలాగే అర్మాన్, సూరజ్ 2, అబోజర్ 1 పాయింట్ తో టైటాన్స్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు. ఇలా రైడింగ్ లో 21, ట్యాకిల్స్ లో 9, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో 3 ఇలా మొత్తంగా 35 పాయింట్లు సాధించింది. 

ప్రత్యర్థి తమిళ్ తలైవాస్ జట్టు రైడింగ్ లో 22, ట్యాకిల్స్ లో 8 పాయింట్లతో తెలుగు జట్టుకు గట్టి పోటీ  ఇచ్చింది. కానీ ఆలౌంట్లు, ఎక్స్‌ట్రాల రూపంలో ఆ జట్టుకు ఎలాంటి పాయింట్లు సాధించలేకపోయింది. ఆటగాళ్లలో అజిత్ 14, రాహుల్ చౌదరి 5, షబీర్ 4 పాయింట్లతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. ఇలా 35-30 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్  విజయాన్ని అందుకుంది.