ప్రో కబడ్డి సీజన్ 7 లో హర్యానా స్టీలర్స్ మరో విజయాన్ని అందుకుంది. అహ్మదాబాద్ వేదికన జరిగిన మ్యాచ్ లో యూపీ యోదాస్ చివరివరకు పోరాడినా హర్యానాపై పైచేయి సాధించలేకపోయింది. ఈ రెండు జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన పోరులో హర్యానా కేవలం 3 పాయింట్ల తేడాతో విజేతగా నిలిచింది. ఆ జట్టు స్టార్ రైడర్ వికాస్ కండోలా 12 పాయింట్లతో అదరగొట్టడంతో ఈ విజయం సాధ్యమయ్యింది. 

ఈ మ్యాచ్ లో ఇరుజట్లు చివరివరకు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడాయి. కానీ చివర్లో హర్యానా  స్వల్ప తేడాతో విజయాన్ని అందుకుంది. స్టీలర్స్ జట్టు రైడింగ్ లో 20, ట్యాకిల్స్ లో 12, ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం ద్వారా 4  ఇలా  మొత్తం 36 పాయింట్లు సాధించింది.  

ఆటగాళ్ల విషయానికి వస్తే  వికాస్ అత్యధికంగా 12 పాయింట్లు సాధించాడు. మిగతావారిలో  సునీల్ 6, ప్రశాంత్ 3,వినయ్ 3, నవీన్ 3 పాయింట్లతో రాణించారు. ఇలా ఆటగాళ్లందరూ సమిష్టిగా ఆడి తలో కొన్ని  పాయింట్లు సాధించి తమ జట్టును గెలిపించుకోగలిగారు. 

ఇక యూపీ కూడా అద్భుతంగా ఆడినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. రైడింగ్ లో 21, ట్యాకిల్స్ లో 10, ప్రత్యర్థిని  ఓసారి ఆలౌట్ చేసి  2 ఇలా మొత్తం 33 పాయింట్లు సాధించింది. ఆటగాళ్లలో  శ్రీకాంత్ 9, మోను 5, సురేందర్ సింగ్ 5, సుమిత్ 4, నితేశ్ 3  పాయింట్లతో రాణించారు. అయినప్పటికి 33 పాయింట్ల వద్దే యూపీ  పోరాటం ఆగిపోయింది. దీంతో 33-36 తేడాతో యూపీ పై హర్యానా విజయం సాధించింది.