ప్రో కబడ్డి సీజన్ 7 లోమరో రసవత్తర పోరుకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికయ్యింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్ తమిళ్ తలైవాస్ పై స్థానిక బెంగళూరు బుల్స్ జట్టే పైచేయి సాధించింది.
హోం గ్రౌండ్...సొంత ప్రేక్షకుల మధ్యలో బెంగళూరు బుల్స్ జట్టు రంకెలేసింది. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ రైడర్ పవన్ కుమార్ ఏకంగా 17 పాయింట్లతో చెలరేగి తమిళ తలైవాస్ ను మట్టికరిపించాడు. అయితే తమిళ్ తలైవాస్ కూడా గట్టి పోటీనిచ్చినప్పటికి ఓటమిని అంగీకరించక తప్పలేదు. ఇలా ఆరు పాయింట్ల తేడాతో బెంగళూరు జట్టు మరో విజయాన్ని అందుకుంది.
రైడింగ్ లో బెంగళూరు జట్టు 22 పాయింట్లు సాధిస్తే అందులో కేవలం పవనే 17 పాయింట్లు సాధించాడు. అతడి దూకుడు ముందు తలైవాస్ జట్టు నిలవలేకపోయింది. తమిళ జట్టు కేవలం 14 రెండింగ్ పాయింట్లను మాత్రమే వెనుకబడిపోయింది. అయితే ట్యాకిల్స్ లో మాత్రం 12 పాయింట్లతో తలైవాస్ ఆధిక్యం ప్రదర్శించింది. బుల్స్ కేవలం 8 ట్యాకిల్స్ పాయింట్లు మాత్రమే సాధించింది. ఆలౌట్ల ద్వారా బెంగళూరు 2 పాయింట్లు సాధించగా తమిళ జట్టు సున్నాకే పరిమితమయ్యింది. ఎక్స్‌ట్రాల రూపంలో ఇరుజట్లకు తలో పాయింట్ లభిచింది.
ఆటగాళ్ల విషయానికి వస్తే బెంగళూరు జట్టులో పవన్ కుమార్ ఒక్కడే అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక రోహిత్ 5, అమిత్ 5, మోహిత్ 2, మహేందర్ సింగ్ 1 పాయింట్ సాధించారు. తలైవాస్ జట్టులో రాహుల్ చౌదరి 8, మంజిత్ చిల్లర్ 4, అజయ్ ఠాకుర్ 4, సాగర్ 3, మోహిత్ చిల్లర్ 3 పాయింట్లతో ఆకట్టుకున్నారు. చివరివరకు ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా పోరాడినా 33-27 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్ పై బెంగళూరు బుల్స్ విజయం సాధించింది.
