Asianet News TeluguAsianet News Telugu

ఆ ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు భారత్ సిద్దమే.. ప్రధాని మోడీ కీలక ప్రకటన.. 

National Games 2023: ఒలింపిక్స్‌ నిర్వహణపై ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉందని, గత ప్రభుత్వాల కంటే.. తమ ప్రభుత్వం క్రీడలపై మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేసిందని అన్నారు.

PM Modi says India ready to host 2036 Olympics KRJ
Author
First Published Oct 26, 2023, 10:57 PM IST

National Games 2023:  2036లో ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు భారత దేశం సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గోవాలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన 37 వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోడీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ క్రీడల ప్రారంభోత్సవంలో ప్రధాని మాట్లాడుతూ.. గోవాలో అభివృద్ధి చేసిన స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చర్ కొత్త ప్లేయ‌ర్లకు సన్నద్ధం కావడానికి అవకాశం కల్పిస్తుందని అన్నారు. క్రీడారంగంలో భారతదేశం విజయ శిఖరాలను తాకుతున్న తరుణంలో జాతీయ క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

70 ఏండ్లలో జరగనిది ఈసారి ఆసియా క్రీడల్లో జరగడం చూశామని అన్నారు. ఈసారి భారత అథ్లెట్లు 100కు పైగా పతకాలు సాధించి గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారని అన్నారు. జాతీయ క్రీడ‌ల‌ను నిర్వ‌హించ‌డం యువ క్రీడాకారుల‌కు ప్ర‌యోగ వేదిక అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. మన దేశంలో ప్రతిభకు కొదవ లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా కష్ట సమయంలో కూడా భారత్ చాలా మంది ఛాంపియన్‌లను తయారు చేసిందని అన్నారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ గత ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. పాత ప్రభుత్వంలో స్పోర్ట్స్ బడ్జెట్ విషయంలో కూడా చాలా సంకుచితంగా వ్యవహరించాయనీ,  క్రీడలకు ఎందుకు ఖర్చు పెట్టాలని అప్పట్లో అనుకునే వారని అన్నారు.9 ఏండ్ల క్రితం క్రీడల వ్యయం కంటే.. తాము మూడు రెట్లు ఎక్కువ కేటాయింపులు చేశామని అన్నారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం కింద దేశంలోని అగ్రశ్రేణి క్రీడాకారులకు ప్రపంచంలోనే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నామన్నారు.

అలాగే.. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రధాని మోడీ హైలెట్ చేశారు. ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిందని, గగన్‌యాన్ మిషన్‌లో ముఖ్యమైన మైలురాయిని దాటిందని, నమో భారత్ రైళ్లను ప్రారంభించిందని ఆయన చెప్పారు. అలాగే.. ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి విజయవంతంగా ఆపరేషన్ అజయ్ కొనసాగిస్తున్నామని తెలిపారు.  

నేషనల్ గేమ్స్ 2023 

నేషనల్ గేమ్స్ 2023 అక్టోబర్ 26 నుండి నవంబర్ 9 వరకు గోవాలో నిర్వహించబడుతోన్నాయి. దేశం నలుమూలల నుంచి దాదాపు పది వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. జాతీయ క్రీడల్లో 28 వేదికల్లో 43కి పైగా ఈవెంట్లలో క్రీడాకారులు తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించనున్నారు. గోవా, మపుసా, మార్గోవ్, పనాజీ, పోండా, వాస్కోలోని 5 నగరాల్లో ఈ ఆటలు నిర్వహించబడతాయి.

కాగా.. ఈసారి జరుగనున్న 37వ జాతీయ క్రీడల్లో పురాతన భారతీయ క్రీడలైన ఫుట్‌బాల్, రోల్ బాల్, గోల్ఫ్, సెప్కట్‌కరా, మార్షల్ ఆర్ట్స్, కలరి పయట్టు, పెంచక్ సిలాట్‌లను కూడా చేర్చారు. ఇవే కాకుండా తైక్వాండో, లగోరీ, గట్కా, జిమ్నాస్టిక్స్, రోయింగ్ హాకీ, బాక్సింగ్, షూటింగ్, వాటర్ పోలో, లాన్ టెన్నిస్, స్నూకర్, హ్యాండ్‌బాల్, జూడో, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడలు ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios