అంబటి రాయుడు బ్యాటింగ్‌పై టీమ్‌ఇండియా క్రికెటర్  రోహిత్ పొగడ్తల వర్షం కురిపించారు.  పుణేలోని బ్రాబౌర్న్ స్టేడియంలో సోమవారం వెస్టిండీస్‌తో జరిగి మ్యాచ్‌లో రోహిత్ శర్మ (162), అంబటి రాయుడు (100) సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 211 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్యాచ్ విజయంలో వీరి భాగస్వామ్యం కీలక పాత్ర పోషించింది. గత కొంతకాలంగా విపరీతంగా చర్చకు కారణమైన నాలుగో స్థానంలో వచ్చిన అంబటి రాయుడు.. రోహిత్ శర్మకు మంచి సహకారం అందించాడు.

ఈ నేపథ్యంలో అంబటి రాయుడిపై రోహిత్.. ఆసక్తికర కామెంట్ చేశాడు. ప్రపంచకప్‌ నేపథ్యంలో నాలుగో స్థానానికి తాను తగిన ఆటగాడిననే విషయంలో ఉన్న అనుమానాలన్నింటినీ రాయుడు శతకంతో తీర్చేశాడని రోహిత్‌ శర్మ  పేర్కొన్నాడు. 

‘‘రాయుడు చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. నాలుగో స్థానానికి సంబంధించి అన్ని సమస్యలనూ అతడు పరిష్కరించాడు. ఇక ప్రపంచకప్‌ వరకు నంబర్‌-4పై చర్చ ఉండదని అనుకుంటున్నా. రాయుడు గొప్పగా బ్యాటింగ్‌ చేశాడు. భారీ భాగస్వామ్యం అవసరైన సమయంలో అతడు నిలబడ్డాడు. సత్తా చాటుకున్నాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడ్డాక...ఒత్తిడిలో అతడు చక్కగా బ్యాటింగ్‌ చేశాడు. స్వేచ్ఛగా ఆడాడు. మాకు చాలా రోజులుగా రాయుడు తెలుసు. అతడి ప్రతిభ గురించీ తెలుసు’’ అపి రోహిత్‌ చెప్పాడు.