సారాంశం

Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నాలుగో మెడ‌ల్ అందుకోవ‌డానికి సిద్ధంగా ఉంది. టీమిండియా స్టార్ రెజ్ల‌ర్ వినేష్ ఫోగట్ సెమీ ఫైన‌ల్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో  ఫైన‌ల్ కు చేరుకుని తొలి భారత మ‌హిళా రెజ్ల‌ర్ గా రికార్డు సృష్టించారు. 
 

Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్ 2024 మహిళా రెజ్లింగ్‌లో భార‌త‌ స్టార్ రెజ్ల‌ర్ వినేష్ ఫోగట్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టారు. భార‌త్ కు మ‌రో ఒలింపిక్ మెడ‌ల్ ను కన్ఫార్మ్ చేశారు. మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ పోటీలో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ సెమీస్ లో అద్భుత ప్రదర్శనతో క్యూబా రెజ్లర్ కు షాకిచ్చారు. ఒలింపిక్స్ ఫైనల్ కు చేరిన తొలి భారత మహిళా రెజ్లర్ గా వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది.సెమీఫైనల్లో క్యూబాకు చెందిన యుస్నేలిస్ గుజ్మాన్ను ఓడించింది.

 

 

పారిస్ ఒలింపిక్స్ 2024లో వినేష్ పోగ‌ట్ ప్ర‌యాణం గ‌మ‌నిస్తే.. తొలుత జపాన్ స్టార్, ప్ర‌పంచ ఛాంపియ‌న్ రెజ్ల‌ర్ సుసాయ్ హుయ్‌ను ఓడించి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ గెలుపుతో క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఆ త‌ర్వాత ఉక్రెయిన్ కు చెందిన‌ ఒస్కానా లివాచ్  ఓడించి పతకం దిశగా అడుగులు వేసింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో వినేష్ చివరి 5 సెకన్లలో ఫిల్మీ స్టైల్‌లో రెండు పాయింట్లు సాధించి  విజయం అందుకుంది. దీంతో టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్‌ను ఓడించి 3 పాయింట్లు సాధించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది వినేష్ ఫోగ‌ట్.

మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌లో మెరుపు ప్రదర్శన చేసి జపాన్‌కు చెందిన సుసాకిని 3-2తో ఓడించింది. ఈ ఓటమితో ప్రస్తుత వ‌ర‌ల్డ్ చాంపియన్ ఓట‌మి అంద‌రినీ ఆశ్చర్యప‌రిచింది. ఎందుకంటే సుసాకి 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతక విజేత. నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలుచుకుంది. ప్రపంచ చాంపియన్‌ను ఓడించి పతకాల ఆశలను వినేష్ ఫోగట్ పెంచుకుంది. ఈ గెలుపుతో వినేష్ ఫోగ‌ట్ దాదాపు ఒక మెడ‌ల్ ను ఖాయం చేసింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో వినేష్, ఒస్కానా మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే, ఉక్రెయిన్ కు చెందిన‌ ఒస్కానా లివాచ్‌ 7-5తో ఓటమి పాలైంది. 

ఇక సెమీస్ మ్యాచ్ లో  క్యూబా రెజ్లర్ తో తలపడింది. అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల సెమీఫైనల్లో వినేశ్ ఫోగట్ 5-0తో యుస్నేలిస్ గుజ్మన్ లోపెజ్ (క్యూబా)ను ఓడించి ఒలింపిక్స్ ఫైనల్ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్ గా చరిత్ర సృష్టించింది. సెమీస్ లో విజయం సాధిస్తే వినేశ్ కు రజత పతకం ఖాయమైనప్పటికీ ఫైనల్స్ లో గెలిచి గోల్డ్ మెడల్ కొట్టాలని  చూస్తోంది. వినేశ్ ఫోగట్ గోల్డ్ మెడల్ మ్యాచ్ బుధవారం జరగనుంది. 


ఎవ‌రీ వినేష్ ఫోగ‌ట్? 

 

వినేష్ ఫోగట్ భారతీయ స్టార్ రెజ్లర్. ఆగస్టు 25, 1994న హర్యానాలోని భివానీలో జన్మించారు. ఆమె కుస్తీలో త‌మ‌దైన ముద్ర‌వేసిన కుటుంబంలో జన్మించారు. ఆమె మేనమామ, మహావీర్ సింగ్ ఫోగట్, గొప్ప కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత. ఆమెను చిన్న వయస్సులోనే క్రీడకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆమె అనేక విజ‌యాల్లో తోడుగా ఉన్నారు. ఆమె త‌ల్లిదండ్రులు వినోద్ ఫోగట్-సరళా దేవి. రోహ్‌తక్‌లోని రాణి లక్ష్మీ బాయి స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయంలో తన విద్యను కొనసాగించిన తర్వాత ఆమె గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసింది. రెజ్లింగ్ లో స్టార్ గా ఎదిగి అంత‌ర్జాతీయ స్థాయిలో అనేక విజ‌యాలు అందుకున్నారు. 53 కేజీల విభాగంలో ప్రపంచ నంబర్ 1 గా ఉన్నారు. 

వినేష్ ఫోగట్ కెరీర్ హైలైట్స్

2018 ఆసియా క్రీడల్లో బంగారు పతక విజేత
2018 కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతక విజేత
2019 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత
రెండుసార్లు ఆసియా ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్ (2018, 2019)
మూడుసార్లు కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్ (2016, 2017, 2018)
2016 రియో ​​ఒలింపిక్స్‌లో మోకాలి గాయం కారణంగా చాలా నెలలపాటు ఆమెను కమిషన్‌కు దూరంగా ఉంచింది. అయితే ఆమె దానిని అధిగమించి అద్భుత పున‌రాగ‌నం చేసింది.

వినేష్ ఫోగట్ అందుకున్న అవార్డులు 

అర్జున అవార్డు (2014)
పద్మశ్రీ (2022)
లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ (2019)కి నామినేట్ అయ్యారు. 
ప్రస్తుత 53 కేజీల విభాగంలో ప్రపంచ నంబర్ 1 ర్యాంక‌ర్ 

వినేష్ ఫోగట్ రెజ్లింగ్ పట్ల నిబద్ధత, ఆమె సాధించిన విజయాలు ఆమెను భారతదేశంలోని యువ మహిళా అథ్లెట్లకు రోల్ మోడల్‌గా మార్చాయి. ఆమె ఆటకు ఆమె చేసిన కృషికి, అథ్లెటిక్స్‌లో మహిళల భాగస్వామ్యానికి ఆమె చేసిన సహాయానికి భారత క్రీడా చరిత్రలో కీలక వ్యక్తిగా గుర్తుండిపొతుంది.