Asianet News TeluguAsianet News Telugu

Paris Olympics 2024: ముగిసిన విశ్వ క్రీడా పోటీలు... సంబరాల్లో మెరిసిన అథ్లెట్లు, కళాకారులు

పారిస్‌లోని స్టేడ్‌ డి ఫ్రాన్స్‌ స్టేడియంలో జరిగిన ఒలింపిక్స్‌ ముగింపు ఉత్సవాలు అంబరాన్నంటాయి. ప్రఖ్యాత నృత్యకారులు, సంగీత కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

Paris Olympics 2024: A Grand Finale with Spectacular Performances and Medal Tally GVR
Author
First Published Aug 12, 2024, 8:42 AM IST | Last Updated Aug 12, 2024, 8:51 AM IST

Paris Olympics 2024: ఫ్రాన్స్ దేశ రాజధాని పారిస్ వేదికగా 17 రోజుల పాటు సాగిన ప్రపంచ క్రీడా సంబరాలు ముగిశాయి. పారిస్‌లో జూన్‌ 26న ప్రారంభమైన ఒలింపిక్స్‌ క్రీడలు.. ఆగస్టు 11న (ఆదివారం) సమాప్తమయ్యాయి. పారిస్‌లోని సెన్‌ నది ఒడ్డున అట్టహాసంగా ప్రారంభమైన ఒలింపిక్స్ పోటీలు.. స్టేడ్‌ డి ఫ్రాన్స్‌ స్టేడియంలో అంతే అట్టహాసంగా నిర్వహించిన వేడుకల మధ్య ముగిశాయి. 

 

పారిస్‌లోని స్టేడ్‌ డి ఫ్రాన్స్‌ స్టేడియంలో జరిగిన ఒలింపిక్స్‌ ముగింపు ఉత్సవాలు అంబరాన్నంటాయి. ప్రఖ్యాత నృత్యకారులు, సంగీత కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అన్ని దేశాల క్రీడాకారులు, పతక విజేతలు పాల్గొని సందడి చేశారు. భారతీయ క్రీడాకారులు షూటర్‌ మను బాకర్‌, హాకీ దిగ్గజం పీఆర్‌ శ్రీజేష్‌ కవాతులో పాల్గొన్నారు. 

 

కాగా, పారిస్‌ ఒలింపిక్స్‌- 2024లో 32 క్రీడాంశాల్లో పోటీ జరిగింది. 206 దేశాలకు చెందిన 10వేల 714 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. 329 స్వర్ణ పతకాలకు పోటీలు జరగ్గా... అమెరికా 40 గోల్డ్‌ మెడల్స్‌ సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆఖరి రోజైన ఆదివారం పతకాల్లో టాప్‌లో ఉన్న చైనాను వెనక్కి నెట్టిన అమెరికా.. అగ్రస్థానాన్ని అధిరోహించింది. కాగా, 40 గోల్డ్‌ మెడల్స్‌తో పాటు మొత్తంగా 126 పతకాలను అమెరికా సొంతం చేసుకుంది. చైనా కూడా 40 స్వర్ణాలతో పాటు మొత్తం 91 పతకాలను గెలుచుకొని రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత 20 గోల్డ్‌లతో జపాన్‌ మూడో స్థానంలో నిలిచింది. 

అయితే, గత ఒలింపిక్స్‌ (టోక్యో ఒలింపిక్స్‌)లో 7 పతకాలతో 48వ స్థానంలో నిలిచిన ఇండియా.. ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో 6 పతకాలకు పరిమితమై 71వ స్థానానికి పడిపోయింది. భారత్‌ నుంచి మొత్తం 117 మంది అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పటికీ సాధించిన పతకాలు 6 (ఒక రజతం, 5 కాంస్యాలు) మాత్రమే. 

 

కాగా, 17 రోజుల పాటు పతకాల కోసం పోరాడిన క్రీడాకారులు ముగింపు వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. జిమ్నాస్టిక్స్, ట్రాక్ అండ్ ఫీల్డ్, బాస్కెట్‌బాల్, సాకర్, మొదటిసారి బ్రేకింగ్‌తో సహా అన్ని ఈవెంట్‌లలో పతకాల కోసం పోటీపడిన అథ్లెట్లు పారిస్‌కు ఉత్తరాన ఉన్న స్టేడ్ డి ఫ్రాన్స్‌లో సమావేశమయ్యారు. తర్వాత ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు.

 

ఇంటర్నేషనల్‌ ఒలింపిక్స్‌ కమిటీ (IOC) అధ్యక్షుడు థామస్ బాచ్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముగింపు వేడుకల్లో మెరిశారు. ఫ్రెంచ్ గాయకుడు- పాటల రచయిత జాహో డి సాగజాన్ ‘సౌస్ లే సియెల్ డి ప్యారిస్’ పాట పాడి అలరించారు. ఫ్రెంచ్ స్విమ్మర్ లియోన్ మార్చాండ్ పారిస్‌లోని జార్డిన్ డెస్ టుయిలరీస్‌లో ఒలింపిక్ జ్యోతిని మోసుకెళ్లగా.. వివిధ దేశాల అథ్లెట్లు తమ దేశ పతాకాలను మోసుకుంటూ కవాతు  చేశారు. అభిమానులు సైతం ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios