Asianet News TeluguAsianet News Telugu

పాక్ ను చిత్తు చేసిన బంగ్లా: ఫైనల్లో భారత్ తో పోరు

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కొద్దిసేపటిక్రితమే ప్రారంభమయ్యింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బంగ్లా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.  

pakistan vs bangladesh match updates
Author
Abu Dhabi - United Arab Emirates, First Published Sep 26, 2018, 5:45 PM IST

అబుదాబి: ఆసియా కప్ చివరి సూపర్ ఫోర్ పోరులో పాకిస్తాన్ ను చిత్తు చేసి బంగ్లాదేశ్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత్ తో బంగ్లాదేశ్ ఫైనల్లో తలపడనుంది.  బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 37 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించింది. 

పాకిస్తాన్ 18 పరుగులకు 3 వికెట్లు చేజార్చుకుంది. ఫఖర్‌ జమాన్‌ (1)ను తొలి ఓవర్లోనే మెహదీ హసన్‌ ఔట్ చేశాడు. ముస్తఫిజుర్‌ తన వరుస రెండు ఓవర్లలో బాబర్‌ ఆజమ్‌ (1), సర్ఫరాజ్‌ (10)లను ఔట్ చేసి పాకిస్తాన్ గుండెల్లో గుబులు రేపాడు. 

ఈ స్థితిలో ఇమామ్, షోయబ్‌ మాలిక్‌ (51 బంతుల్లో 30; 2 ఫోర్లు) కలిసి ఇన్నింగ్సును నిర్మించేందుకు ప్రయత్నించారు. అయితే బంగ్లాదేశ్ కట్టుదిట్టమైన బౌలింగు వల్ల, ఫీల్డింగ్ వల్ల పరుగులు రాబట్టడం పాకిస్తాన్ కు గగనమే అయింది.

ఇమామ్, మాలిక్‌ మూడో వికెట్‌కు 16.4 ఓవర్లలో 67 పరుగులు మాత్రమే జోడించగలిగారు. మిడ్‌ వికెట్‌లో కెప్టెన్‌ మొర్తజా అద్భుత క్యాచ్‌ పట్టడంతో మాలిక్‌  వెనుదిరిగాడు. ఆ తర్వాత షాదాబ్‌ (24 బంతుల్లో 4) ఐదో వికెట్‌గా అవుటయ్యాడు. 

ఇమామ్‌ ఉల్‌ హక్ ఒంటరి పోరాటం చేశాడు. అతనికి ఆసిఫ్‌ అలీ (47 బంతుల్లో 31; 3 ఫోర్లు) అండగా నిలిచాడు. అయితే రెండు పరుగుల వ్యవధిలో వీరిద్దరిని లిటన్‌ దాస్‌ స్టంపౌట్‌ చేయడంతో పాకిస్తాన్ మ్యాచుపై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది.  

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన బంగ్లా జట్టు 48.5 ఓవర్లలో 239 పరుగులు చేసి ఆలౌటయ్యింది. ముష్పికర్ రహీమ్ 99 పరుగులు వద్ద ఔటయ్యి ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్ కు దిగిన రహీమ్, మిథున్ లు సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు సాధించారు. దీంతో బంగ్లా 239 పరుగులు సాధించగల్గింది. వీరిద్దరు మినహాయిస్తే బంగ్లా బ్యాట్ మెన్స్ ఎవరూ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. 

పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్ 4, షాహీన్ అప్రిది 2, హసన్ అలీ 2, షాదన్ ఖాన్ 1 వికెట్ తీసుకున్నారు. బంగ్లాదేశ్ చివరి ఇద్దరు బ్యాట్ మెన్స్ రనౌట్లయ్యారు. ఇలా  పాకిస్థాన్ కు 140 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది బంగ్లా. 

బంగ్లా ఆటగాడు ముష్పికర్ రహీమ్ ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇతడు షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో ఔటయ్యాడు. సెంచరీ షాట్ కు ప్రయత్నిస్తూ బంతిని గాల్లోకి లేపడంతో పాక్ కెప్టెన్ సర్పరాజ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో రహీమ్ సెంచరీ మిస్సై పెవిలియన్ బాట పట్టాల్సివచ్చింది. ఇలా 197 పరుగుల వద్ద బంగ్లా ఆరో వికెట్ కోల్పోయింది. రహీమ్ 116 బంతుల్లో 99 పరుగులు చేశాడు.

ఎట్టకేలకు బంగ్లా నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మ్యాచ్ ఆరంభంలోనే కేవలం 12 పరుగుల వద్దే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్ ను రహీమ్, మిథున్ లు ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండానే స్కోరును సెంచరీ మార్కు దాటించి ఇద్దరూ అర్థశతకాలు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మహ్మద్ మిథున్ ను పాక్ బౌలర్ హసన్ అలీ ఔట్ చేశాడు. దీంతో 156 పరుగుల వద్ద బంగ్లా నాలుగో వికెట్ కోల్పోయింది. అయితే మిథున్ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇమ్రుల్ ఎక్కువసేపు నిలబడలేడు. షాదన్ ఖాన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో 167 పరుగల వద్ద బంగ్లా ఐదో వికెట్ కోల్పోయింది. 

ప్రస్తుతం క్రీజులో రహీమ్, మహ్మదుల్లా లు ఉన్నారు. అయితే రహీమ్ సెంచరీకి మరో ఐదు పరుగుల దూరంలో ఉన్నాడు. మొత్తానికి బంగ్లా 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 

ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లా బ్యాట్ మెన్స్ మొదట్లో తడబడి వెంటవెంటనే మూడు వికెట్లు సమర్పించుకున్నారు. అయితే ఆ తర్వాతి క్రీజులోకి వచ్చిన రహీమ్, మిథున్ లు ఆచితూచి ఆడుతూ నెమ్మదిగానే స్కోరు వేగాన్ని పెంచుతున్నారు. ఈ క్రమంలో జట్టు స్కోరు సెంచరీకి చేరింది. ఇదే క్రమంలో రహీమ్( 73 బంతుల్లో 61 పరుగులు), మిథున్( 72 బంతుల్లో 53 పరుగులు) అర్థ శతకాలను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం బంగ్లా 30 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. 

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కొద్దిసేపటిక్రితమే ప్రారంభమయ్యింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బంగ్లా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ నిర్ణయం తప్పని తెలియడానికి బంగ్లాకు ఎంతో సమయం పట్టలేదు. పాక్ బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

బంగ్లా ఓపెనర్ సౌమ్య  సర్కార్ రెండో ఓవర్ లోనే జునైద్ ఖాన్ బౌలింగ్ లో డకౌటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మోమినల్ హక్ (5 పరుగులు)ను షాహిన్ అఫ్రిది వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత జునైద్ ఖాన్ బౌలింగ్ లో లిటన్ దాస్ మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో కేవలం 12 పరుగులకే 3 ప్రధాన వికెట్లు కోల్పోయి బంగ్లా కష్టాల్లో పడింది. 

ఆదిలోనే 3 వికెట్లు పడటంతో బంగ్లా బ్యాట్ మెన్స్ ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో ముష్పికర్ రహ్మాన్ (21 బంతుల్లో 13 పరుగులు), మహ్మద్ మిథున్ (16 బంతుల్లో 3 పరుగులు) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 10 ఓవర్లలో 31 పరుగులు చేసిన బంగ్లా 3 వికెట్లు కోల్పోయింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios