ODI WC 2023 : 38 గంటలు విమానంలోనే.. ఎకానమీ క్లాస్ లో ఇంగ్లండ్ జట్టుకు చేదు అనుభవం..
వార్మప్ మ్యాచ్ కోసం గౌహతికి వస్తున్న ప్రయాణంలో ఇంగ్లండ్ జట్టుకు చేదు అనుభవం ఎదురయ్యింది. దీనిమీద స్టార్ ఆటగాడు బెయిర్ స్టో మండిపడ్డాడు.

వన్డే ప్రపంచ కప్ 2023 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ లు ప్రారంభం కావడానికి ముందు వరల్డ్ కప్ లో పాల్గొనబోయే జట్లు వార్మప్ మ్యాచులు ఆడుతున్న సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగానే భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ శనివారం గౌహతి వేదికగా జరగనుంది. దీనికోసం ఇరుజట్లు ఇప్పటికే గౌహతికి చేరుకున్నాయి. గౌహతికి చేరుకునే క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ జట్టుకి ఓ చేదు అనుభవం ఎదురయింది.
గౌహతికి వెళుతున్న విమాన ప్రయాణంలో ఇంగ్లాండ్ జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. విమానంలో ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తున్న ఇంగ్లాండ్ జట్టు దాదాపు 38 గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జానీ బెయిర్ స్టో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంగ్లాండ్ నుంచి గువాహతి వరకు ఎకానమీ క్లాసులోనే ప్రయాణించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇన్ స్టాలో షేర్ చేస్తూ… స్టార్ ఆటగాడు అసహనం వ్యక్తం చేశాడు.
ఈ ఫోటోకి క్యాప్షన్ గా.. ‘అంతా గందరగోళంగా ఉంది. మా ప్రయాణం దాదాపు 30 గంటలకుపైగా సాగింది. విమానంలోకి అడుగుపెట్టిన తర్వాత 38 గంటల పాటు ఉండాల్సి వచ్చింది’ అంటూ ఓ స్మైలీ ఎమోజిని పోస్ట్ చేశాడు. బెయిర్ స్టో పోస్ట్ చేసిన ఫోటోలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్, ఆల్ రౌండర్ క్రిష్ వోక్స్ బాగా అలసిపోయినట్లుగా కనిపించారు. ఇంగ్లాండ్ జట్టు ఎకానమి క్లాసులో కనిపించడంతో వారి చుట్టూ పెద్ద సంఖ్యలో తోటి ప్రయాణికులు గుమి గూడారు.
మామూలుగా అయితే అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు ఎక్కువగా బిజినెస్ క్లాసులో ప్రయాణిస్తుంటారు. అయితే, ఇంగ్లాండ్ జట్టు మాత్రం ఎకానమి క్లాసులో ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందో తెలియదు. శనివారం జరగనున్న భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు మొదలవనుంది.
ప్రపంచ కప్పుకు ఎన్నికైన ఇంగ్లాండ్ జట్టు ఇలా ఉంది…
కెప్టెన్.. జోస్ బట్లర్
మొయిన్ అలీ
జానీ బెయిర్ స్టో
గాస్ అట్కిన్ సన్
సామ్ కరన్
హారీ బ్రూక్
లియామ్ లివింగ్ స్టోన్
డేవిడ్ మలన్
ఆదిల్ రషీద్
జో రూట్
బెన్ స్టోక్స్
రీస్ టోప్లే
డేవిడ్ విల్లే
మార్క్ వుడ్
క్రిస్ వోక్స్