Nikhat Zareen: నిఖత్ జరీన్ సంచలనం.. ప్రపంచ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కు దూసుకెళ్లిన తెలంగాణ బాక్సర్
IBA World championship 2022: తెలంగాణ లోని నిజామాబాద్ కు చెందిన ప్రముఖ యువ బాక్సర్ అంతర్జాతీయ వేదిక మీద సంచలనాలు సాధిస్తున్నది. తాజాగా ఆమె ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కు దూసుకెళ్లింది.
టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ లోని నిజామాబాద్ కు చెందిన యువ బాక్సర్ నిఖత్ జరీనా ఫైనల్ కు దూసుకెళ్లింది. తద్వారా స్వర్ణ లేదా రజత పతకాల్లో ఏదో ఒకదానిని ఖాయం చేసుకున్నది. సెమీస్ లో నిఖత్.. బ్రెజిల్ కు చెందిన డి అల్మీద కరోలిన్ ను 5-0 తేడాతో ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది.
52 కేజీల విభాగంలో పోటీ పడుతున్న జరీన్.. ఫైనల్ లో థాయ్లాండ్ కు చెందిన జుటమస్ జిట్పంగ్ తో పోటీ పడనుంది. కాగా.. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో భారత మహిళా బాక్సర్ ఫైనల్ కు ప్రవేశించడం ఇదే తొలిసారి. ఇక ఫైనల్ లో నిఖత్ గనక పతకం గెలిస్తే అది చరిత్రే కానుంది.
జరీన్ తో పాటు 57 కేజీల విభాగంలో మనీషా, 63 కిలోల విభాగంలో పర్వీన్ లు కూడా సెమీస్ ఆడుతున్నారు. వీళ్ల మ్యాచ్ ల ఫలితాలు అతి త్వరలో విడుదల కానున్నాయి.
కాగా.. ఈ ఈవెంట్ లో ఆది నుంచి రాణిస్తున్న జరీన్.. ప్రీమంగోలియా కు చెందిన అల్తాంట్సెట్సెగ్ ను చిత్తు చేసింది. ఇక సోమవారం జరిగిన క్వార్టర్స్ లో ఇంగ్లాండ్ అమ్మాయి చార్లీ సియాన్ డేవిసన్ ను 5-0తో మట్టికరిపించి సెమీస్ కు చేరింది.