గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మరో రికార్డు... డైమండ్ లీగ్ ఫైనల్స్ గెలిచి చరిత్ర...
స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న డైమండ్ లీగ్ ఫైనల్స్ టైటిల్ గెలిచిన నీరజ్ చోప్రా... గాయం నుంచి కోలుకున్న తర్వాత వరుసగా రెండో టైటిల్..
గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్ 2022 టోర్నీకి దూరమైన ‘గోల్డెన్ బాయ్’ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా తన రీఎంట్రీని ఘనంగా చాటుకుంటున్నాడు. ఆగస్టు 27న డైమండ్ లీగ్ టీమ్‌లో స్వర్ణం నెగ్గిన నీరజ్ చోప్రా, తాజాగా డైమండ్ లీగ్ ఫైనల్స్ టైటిల్ సాధించాడు. తన రెండో ప్రయత్నంలో 88.44 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా, టేబుల్ టాపర్‌గా నిలిచి స్వర్ణం సాధించాడు...
గాయం నుంచి కోలుకున్న తర్వాత డైమండ్ లీగ్ మీట్‌లో 89.08 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా, ఫైనల్స్‌లో అంత దూరం విసరాల్సిన అవసరం కూడా రాలేదు. ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్‌లో, ఒలింపిక్స్‌లో, ఆసియా గేమ్స్‌లో, వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్స్ ఈవెంట్స్‌లో స్వర్ణం నెగ్గిన భారత జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో మాత్రం రజతంతో సరిపెట్టుకున్నాడు...
ఈ విజయంతో నీరజ్ చోప్రాకి 2023 బుడాపెస్ట్ వరల్డ్స్‌కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కింది. ఈ కార్డు ద్వారా టీమిండియా నుంచి ముగ్గురు లేదా అంతకుముందు జావెలిన్ త్రో అథ్లెట్లు, వరల్డ్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనవచ్చు. అయితే వరల్డ్స్‌లో పాల్గొనే అథ్లెట్లు, అత్యుత్తమంగా 85 మీటర్లు విసిరి ఉండాలి లేదా వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 36 లోపు ర్యాంకింగ్ కలిగి ఉండాలి...