దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్ కి బీసీసీఐ టీం ఇండియాను ఖరారు చేసింది. హార్దిక్ పాండ్యకు తిరిగి జట్టులో చోటు కల్పించారు. కాగా... టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కి మాత్రం చోటు దక్కలేదు. అతని స్థానంలో యువ క్రికెటర్ రిషభ్ పంత్ ని ఎంపిక చేశారు.  కాగా... ధోనీని ఎంపిక చేయకపోవడంపై సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణ ఇచ్చారు.

ఎంపికకు ధోనీ అందుబాటులో లేడని ఎమ్మెస్కే వెల్లడించాడు. లెహ్‌ నుంచి వచ్చిన ధోనీ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో పర్యటిస్తున్నాడని తెలిసింది. దీంతో తాము ముందుకు పోవాల్సి వచ్చిందని ఎమ్మెస్కే పేర్కొన్నారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ధోనీకి అవకాశాలు ఇవ్వడం కష్టమేనని సమాచారం. అతడి స్థానంలో పంత్‌ను భవిష్యత్‌ కీపర్‌గా తీర్చిదిద్దాల్సిన అవసరముందని సెలక్షన్‌ కమిటీ భావిస్తోందట.