భారత్ మాజీ కెప్టెన్ ధోనీ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఏడుగురు క్రికెటర్లలో ధోనీతో పాటు గ్రేమ్ స్మిత్, సనా మిర్ తదితరులు ఉన్నారు.

భారత క్రికెట్ (Cricket) చరిత్రలో మరొక మైలురాయిగా నిలిచే ఘనత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2025 సంవత్సరానికి గాను ప్రకటించిన హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో ధోనీకి స్థానం లభించింది. ప్రపంచ క్రికెట్‌ను ప్రభావితం చేసిన ఏడుగురు ప్రముఖులకు ఈసారి ఈ గౌరవం లభించగా, అందులో ధోనీ కూడా ఒకడిగా నిలిచాడు.

ఈ ఏడుగురు క్రికెటర్లలో ఐదుగురు పురుషులు కాగా, ఇద్దరు మహిళా క్రికెటర్లు ఉన్నారు. భారత్ తరఫున ధోనీ (Dhoni) ఉన్నాడు. దక్షిణాఫ్రికా నుండి మాజీ కెప్టెన్లు గ్రేమ్ స్మిత్, హషీమ్ అమ్లా, ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ హేడెన్, న్యూజిలాండ్ కెప్టెన్‌గా కొనసాగిన డానియల్ వెట్టోరి ఈ జాబితాలో నిలిచారు. మహిళల విభాగంలో పాకిస్తాన్ స్టార్ సనా మిర్, ఇంగ్లండ్‌కి చెందిన వికెట్ కీపర్-బ్యాట్స్‌వుమన్ సారా టేలర్‌కు కూడా చోటు దక్కింది.

ఈ సందర్భంగా ఐసీసీ (Icc) చైర్మన్ జై షా మాట్లాడుతూ, క్రికెట్‌ను ఎదుగుదలకు నడిపించిన క్రికెటర్లను స్మరించుకోవడానికి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిపేందుకు హాల్ ఆఫ్ ఫేమ్‌ను వేదికగా చేస్తున్నామని తెలిపారు. ఏడుగురు కొత్త సభ్యులను ఆహ్వానిస్తున్నామని, వారికి ఐసీసీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని చెప్పారు.

ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. 2007లో మొదటిసారి నిర్వహించిన టీ20 వరల్డ్ కప్‌ను గెలిపించాడు. ఆ తర్వాత 2011 వన్డే ప్రపంచ కప్‌ను దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత్ చేతుల్లోకి తీసుకొచ్చాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్ గెలవడంలో అతడి నాయకత్వం కీలకంగా నిలిచింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ 538 మ్యాచ్‌లు ఆడి, మొత్తం 17,266 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్‌గా 829 ఔట్లలో పాల్గొన్నాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కూడా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కొనసాగుతున్నాడు.

ఈసారి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో(ICC Hall Of Fame) చోటు దక్కించుకోవడం ద్వారా ధోనీకి మరో అరుదైన గౌరవం లభించింది. క్రికెట్‌ను ఆదర్శంగా చూసే యువతకు అతడి ప్రయాణం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.