MS Dhoni bike ride: ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత రాంచీలో తన బైక్‌పై దర్శనమిచ్చిన ధోనీ ఫోటో వైరల్ అవుతోంది.

MS Dhoni bike ride in Ranchi goes viral: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోనీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత తన స్వస్థలమైన రాంచీలో ధోని బైక్‌పై కనిపించాడు. వీటిని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పంచుకోగా, వైరల్ అవుతున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2025 లో ఆడిన ధోని.. రాబోయే సీజన్ లో ఆడతాడా అనేది చెప్పకుండా ఫ్యాన్స్ తలపట్టుకునేలా చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్ ధోనీకి అంతగా కలిసి రాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు విజయాలతో సీఎస్‌కే పాయింట్స్ పట్టికలో చివర స్థానంతో సరిపెట్టుకుంది.

రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా టోర్నీ మధ్యలో తప్పుకోవడంతో ధోనీ మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఐపీఎల్ 2025 చివరి మ్యాచ్ తర్వాత ధోనీ మీడియాతో మాట్లాడుతూ.. తన భవిష్యత్తు పై స్పష్టత ఇవ్వకుండా, “ఇప్పుడు ఏం చేయాలో అనేది ఆలోచించాలి. నాకు సమయం ఉంది. చాలా కాలంగా ఇంటికి వెళ్ళలేదు. రాంచీకి వెళ్తాను. కొన్ని బైక్ రైడ్లు ఎంజాయ్ చేస్తాను. తరువాత నిర్ణయం తీసుకుంటాను” అని చెప్పాడు.

ఐపీఎల్ 2025లో ధోనీ 13 ఇన్నింగ్స్‌ల్లో 196 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 135.17 కాగా, డెత్ ఓవర్లలో ఇది 151.72గా ఉంది. ధోనీ ఈ సీజన్‌లో 12 ఫోర్లు, 12 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ 2025లో ధోని అత్యధిక స్కోర్ 30 పరుగులు.. నాటౌట్‌గా రెండు సార్లు నమోదు చేశాడు. వాటిని ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సాధించాడు.

ఐపీఎల్ 2025 చివరి మ్యాచ్ లో ధోని చెప్పినట్టుగానే ప్రస్తుతం తనకు ఇష్టమైన కావాసాకి బైక్‌తో రాంచీ వీధుల్లో సేదతీరుతూ కనిపించాడు. తలపై హెల్మెట్, సాధారణ దుస్తులతో మునుపటి లాగే నిరాడంబరంగా ధోని కనిపించాడు. ధోని బైక్ పై వెళ్తుండగా, పలువురు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో అవి వైరల్ గా మారాయి.

 

Scroll to load tweet…

 

ధోనీకి బైక్‌లు అంటే చాలా ఇష్టం. అతని గ్యారేజీలో కార్లతో పాటు చాలా బైకులు ఉన్నాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇటీవల ధోని దేశభక్తిని ప్రతిబింబించే టీషర్ట్ ధరించి చేపలు పట్టుకోవడం కూడా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

తన రిటైర్మెంట్‌పై ధోని మాట్లాడుతూ.. “ప్రతీ సంవత్సరం బాడీ ఫిట్‌గా ఉండేందుకు 15% ఎక్కువ శ్రమ చేయాలి. ఇది ప్రొఫెషనల్ క్రికెట్. ఎప్పుడు ఆడగలిగే స్థితిలో ఉన్నామా అనేది ముఖ్యమైన ప్రశ్న” అని ధోనీ అన్నారు. ఐపీఎల్ 2025లో సీఎస్‌కే ప్రదర్శన నిరాశాజనకమైనప్పటికీ, ధోనీ ఇంకా తన భవిష్యత్తు పై నిర్ణయం తీసుకోలేదు. అయితే, రాబోయే సీజన్ లో కూడా ధోని ఆడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.