టీం ఇండియా క్రికెటర్ మహ్మాద్ షమీ భార్య హసీన్ జహాన్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం అర్థరాత్రి ఆమెను పోలీసులు అరెస్టు చేయగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.

తమ ఇంట్లోకి హసీన్ జహాన్ అక్రమంగా ప్రవేశించిందని మహ్మద్ షమీ తల్లి పోలీసులకి ఫిర్యాదు చేయగా.. సెక్షన్ 151 కింద పోలీసులు ఆమెని అరెస్టు చేశారు. ఈ సెక్షన్‌ కింద పోలీసులు ఎలాంటి వారెంటు లేకుండానే అరెస్టు చేసే వెసులబాటు ఉంటుంది. 

గతేడాది హసీన్ జహాన్... భర్త షమీపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. షమీ మీద పోలీసులకు కేసు కూడా పెట్టింది. కాగా.. ఆదివారం రాత్రి హసీన్ జహాన్.. భర్త షమీ ఇంటికి వెళ్లి.. అతని తల్లితో గొడవ పడింది. దీంతో.. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు జహాన్‌‌‌ని అరెస్టు చేశారు. 

ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2019 సీజన్‌‌లో ప్రస్తుతం ఆడుతున్న మహ్మద్ షమీ.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజా సీజన్‌లో ఇప్పటికే 11 మ్యాచ్‌లాడిన ఈ ఫాస్ట్ బౌలర్ 14 వికెట్లు పడగొట్టగా.. సీజన్‌లో 11 మ్యాచ్‌లాడిన పంజాబ్ ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.