Asianet News TeluguAsianet News Telugu

'లైవ్ ఇట్ అప్' అఫిషియల్ సాంగ్‌తో.. సాకర్ సమరం ఆరంభం

గురువారం జూన్ 14.. సాయంత్రం 6:30..!

Mega Event to 'Live It Up' on Thursday

హైదరాబాద్: ఫుట్‌బాల్ గేమ్ లవర్స్ ఒళ్ళంతా కళ్ళుగా చేసుకొని ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న వరల్డ్ కప్ మెగా ఈవెంట్స్ సమాహారం.. సంవత్సరాలు, నెలలు, రోజులు దాటుకొని మరి కొన్ని పదుల గంటల్లో  'లైవ్ ఇట్ అప్' అఫిషియల్ సాంగ్‌తో ఆరంభం కానుంది. టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సాంగ్ స్టయిల్‌లో చెప్పాలంటే.. గురువారం, జూన్ 14, సాయంత్రం 6:30కి లైవ్ కవరేజ్‌తో మొదలవుతుంది. ప్రారంభ వేడుకలకు తోడు రష్యా, సౌదీ అరేబియా మధ్య రాత్రి 8.30 గంటలకు జరిగే తొలి మ్యాచ్‌కు మాస్కోలోని లుజ్‌నికి స్టేడియం వేదిక కానుంది. మ్యాచ్‌కు సరిగ్గా 30 నిముషాల ముందు డ్యాన్సర్లు, జిమ్నాస్టిక్ ప్రొఫెషనల్స్ సహా 500 మంది కళాకారులు తమదైన ప్రతిభా ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా వీక్షకులను మంత్రముగ్దులను చేయనున్నారు. విల్ స్మిత్, నికి జామ్ 'లైవ్ ఇట్ అప్' అఫిషియల్ సాంగ్‌ పెర్‌ఫామ్ చేస్తారు. రోబీ విలియమ్స్, రష్యన్ ఒపెరా ఆర్టిస్ట్ అయిదా గ్యారీ‌ఫుల్లినా కూడా క్రీడా ప్రపంచాన్ని అలరించునున్నారు. ఆరంభ వేడుకకు అదనపు ఆకర్షణగా రొనాల్డో మెరవనున్నాడు.


ఒలింపిక్స్‌ను సైతం తలదన్ని ప్రపంచంలోనే అత్యధిక వీక్షకాదరణను నమోదు చేసుకొనే క్రీడా సమరంగా గురువారం నుంచి మొదలు కానున్న ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఈవెంట్ సరికొత్త చరిత్ర సృష్టించనుంది. ఆ రోజున భూమిపైన అన్ని రహదారులు రష్యాకు దారి తీస్తాయంటే అతిశయోక్తి కాదేమో! 11 నగరాల్లోని 12 స్టేడియాలు 64 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. తొలి, చివరి మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే మాస్కోలోని లుజ్‌నికి స్టేడియంలో 81,006 మంది ప్రేక్షకులు పడతారు. ఇంతటి కీలకమైన స్టేడియాన్ని అక్షరాలా 410 మిలియన్ డాలర్ల ఖర్చుతో రెనొవేట్ చేశారు. 


వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్య హక్కులను రష్యా దక్కించుకోడం వెనుక వివాదాలు ఎన్ని ఉన్నప్పటికీ తొలి విజిల్ వినిపించిన మరుక్షణం ఫుట్‌బాల్ క్రీడకు వీరాభిమానులు వాటన్నింటిని పక్కనపెట్టి గేమ్‌‌ను వారి గుండెగా చేసుకుంటారు. జులై 15 దాకా తమదైన లోకంలో విహరిస్తారు.


వరల్డ్ కప్ విషయానికి వస్తే... తెలుగు రాష్ట్రాలేమీ తక్కువ తినలేదు. హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ లాంటి ప్రధాన రహదారుల్లో ఫుట్‌బాల్ హడావుడి ఇప్పటికే మొదలైంది. గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవారు ఓపెన్ ప్లేస్‌లో స్క్రీన్స్, ప్రొజెక్టర్లతో మ్యాచ్‌లను అందరూ కలిసి లైవ్‌లో చూసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారి హంగామా చూస్తుంటే కార్తిక మాసంలో వన భోజనాలను తలపిస్తున్నది.


ఇక పబ్స్, బార్లు, ఖరీదైన హోటళ్ళు సైతం కస్టమర్లకు మందు, విందుతో పాటు ఫుట్‌బాల్ వినోదాన్ని అందించడానికి సర్వం సిద్ధం చేసుకున్నాయి. 
కుర్రకారు హడావుడి యూనివర్శిటీల నుంచి స్కూళ్ళ దాకా పాకింది. మొత్తంగా చూస్తే వృద్ధుల నుంచి పిల్లల దాకా అందర్నీ వరల్డ్ కప్ జ్వరంలా పట్టుకుందని చెప్పవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios