Manu Bhaker: భారత తొలి మహిళా ఒలింపియన్.. మను భాకర్ సరికొత్త రికార్డు
Paris Olympics 2024 - Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్ లో భారత స్టార్ షూటర్ మనుభాకర్ చరిత్ర సృష్టించారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి మెడల్ ను అందించారు. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డు సాధించారు.
Paris Olympics 2024 - Manu Bhaker : దాదాపు అన్ని దేశాలు పాల్గొంటున్న విశ్వక్రీడలకు వేదికైన పారిస్ లో భారత్ కు అద్భుతమైన సర్వంగా నిలబడే క్షణాలు అందించింది మను భాకర్. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమైన రెండో రోజునే భారత్ కు మెడల్ ను అందించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 221.7 పాయింట్లతో మను భాకర్ కాంస్య పతకం గెలిచారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు ఇది తొలి మెడల్. 243.2 పాయంట్లతో కొరియన్ ప్లేయర్ ఓహ్ యే జిన్ గోల్డ్ మెడల్ కొట్టారు. మరో కొరియన్ షూటర్ కిమ్ సిల్వర్ మెడల్ సాధించారు.
మను భాకర్ సరికొత్త చరిత్ర
భారత షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ షూటర్‌గా మను రికార్డు సృష్టించాడు. ఫైనల్లో మను మొత్తం 221.7 పాయింట్లు సాధించారు. ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. అలాగే, ఒలింపిక్స్ చరిత్రలో షూటింగ్‌లో భారత్‌కు ఇది ఐదో పతకం. కొరియా ప్లేయర్లు ఓహ్ యే జిన్ స్వర్ణం (243.2 పాయింట్లు), కిమ్ యేజీ (241.3) రజత పతకాలు సాధించారు. మను భాకర్ భారత్ తరఫున షూటింగ్ లో మెడల్ గెలిచిన తొలి మహిళా షూటర్ గా రికార్డు సృష్టించారు.
మను క్వాలిఫికేషన్ రౌండ్ ఇలా..
మను భాకర్ 60 షాట్ల క్వాలిఫైయింగ్ రౌండ్‌లో మొత్తం 580 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. భాకర్ మొదటి సిరీస్‌లో 97, రెండో సిరీస్‌లో 97, మూడోది 98, నాలుగో 96, ఐదో సిరీస్‌లో 96, ఆరో సిరీస్‌లో 96 పాయింట్లు సాధించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో రిథమ్ సాంగ్వాన్ కూడా పాల్గొంటున్నప్పటికీ, ఆమె నిరాశపరిచింది. 573 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచింది. ఫైనల్ రౌండ్ లో 221.7 పాయింట్లతో మను భాకర్ కాంస్య పతకం గెలిచారు.
మను కు ఇది రెండో ఒలింపిక్స్
భారత షూటర్ మను భాకర్ పారిస్ 2024లో తన రెండో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటోంది. అంతకుముందు మను టోక్యో ఒలింపిక్స్ 2020 లో అరంగేట్రం చేసారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ సమయంలో ఆమె పిస్టల్ దెబ్బతినడంతో పతకాన్ని గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయారు. మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల పిస్టల్, 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లలో మెడల్ సాధించలేకపోయింది. 22 ఏళ్ల మను భాకర్ పారిస్ 2024 ఒలింపిక్ షూటింగ్ పోటీలో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్, మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లలో పోటీ పడుతోంది. 21 మంది సభ్యులతో కూడిన భారత షూటింగ్ జట్టు నుండి బహుళ వ్యక్తిగత ఈవెంట్లలో పోటీ పడిన ఏకైక క్రీడాకారిణి ఆమె.