సొంత అభిమానుల మధ్య ‘మహీంద్ర’జాలం పనిచేసేనా..? ఫార్ములా రేసులో ఉన్న ఒకే ఒక్క భారత జట్టు..
Formula E Race in Hyderabad: శనివారం హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేసు జరుగబోతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్ఐఏ) భారత్ లో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ రేస్ లో భారత్ నుంచి ఒకే జట్టు బరిలో ఉంది.
అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్ఐఏ) ఆధ్వర్యంలో 2014 నుంచి నిర్వహిస్తున్న ఫార్ములా ఈ రేస్ కు విదేశాల్లోనే గాక భారత్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. విదేశాల్లో స్ట్రీట్ సర్క్యూట్ ల మీద ఎలక్ట్రిక్ వెహికిల్స్ దూసుకుపోతుండటం అభిమానులను అలరిస్తున్నది. ఈ మజాను టీవీలలో, యూట్యూబ్ లలో వీక్షించి వినూత్న అనుభూతికి లోనైన భారతీయ అభిమానులు.. ఇప్పుడు వాటిని ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. ఈ మేరకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ సిద్ధమైంది. భారత్ నుంచి కూడా ఈ పోటీలలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఆధ్వర్యంలోని ‘మహీంద్ర’ కూడా ఈ పోటీలలో బరిలో నిలిచింది.
భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్ చుట్టూరా.. 2.8 కిలోమీటర్ల దూరంలో ఎలక్ట్రిక్ కార్లు దూసుకుపోనున్నాయి. ఫిబ్రవరి 11న జరిగే ఈ పోటీలలో పాల్గొనబోయే టీమ్స్, డ్రైవర్స్ ఇతరత్రా వివరాలు ఇక్కడ చూద్దాం.
ఫార్ములా ఈ టీమ్స్ - డ్రైవర్స్
జట్లు డ్రైవర్లు పవర్‌ట్రైన్ (నడిపే కారు)
డీఎస్ పెన్స్‌కె స్టోఫెల్ వాండూర్న్ డీఎస్ ఈ- టెన్స్ ఎఫ్ఈ 23
జాగ్వర్ టీసీఎస్ రేసింగ్ మిచ్ ఎవాన్స్ సామ్ బర్డ్ జాగ్వార్ 1-టైప్ 6
ఎన్విసన్ రేసింగ్ సెబాస్టియన్ బ్యూమి, నిక్ క్యాసిడి జాగ్వార్ 1-టైప్ 6
మహీంద్ర రేసింగ్ లుకాస్ డి గ్రాసి, ఒలివర్ రొనాల్డ్ మహీంద్ర ఎమ్9 ఎలక్ట్రో
అబ్ట్ కప్ర రాబిన్ ఫ్రిన్స్, నికో మ్యూల్లర్ మహీంద్ర ఎమ్9 ఎలక్ట్రో
నిస్సాన్ సచా ఫెన్స్ట్రాజ్, నోర్మన్ నాటో నిస్సాన్ ఈ 4ఓర్స్ 04
నియోమ్ మెక్ లారెన్ జేక్ హ్యూగ్స్, రెన్ రస్ట్ నిస్సాన్ ఈ 4ఓర్స్ 04
మసెరటి ఎంఎస్జీ రేసింగ్ ఎడొర్డొ మొర్టర, మాక్స్ గెంటర్ మసెరటి టిపో ఫోల్గోర్
టాగ్ హ్యూర్ పోర్షే ఆంటోనియా ఫెలిక్స్ డ కోస్టా, పాస్కల్ వెహ్ల్రిన్ పోర్షే 99ఎక్స్ ఎలక్ట్రిక్
అవలాంచ్ అండ్రెట్టి అండ్రె లాటరర్, జేక్ డెన్నిస్ పోర్షే 99ఎక్స్ ఎలక్ట్రిక్
నియో 333 రేసింగ్ డాన్ టిక్టమ్, సెర్గియో సెట్టె కెమర నియో 333 ఈఆర్9
మహీంద్ర ప్రస్థానం..
2014లో ప్రారంభమైన ఫార్ములా ఈ రేసు నుంచీ మహీంద్ర పోటీలో ఉన్నారు. భారత ఆటో మొబైల్ సంస్థగా రాణిస్తున్న ఆయన.. ఈ పోటీల్లో కూడా ఆయన టీమ్ సత్తా చాటుతున్నది. తొలి సీజన్ లో మహీంద్ర టీమ్ 8వ స్థానంలో నిలిచింది. తర్వాత వరుస సీజన్ లలో వరుసగా 5, 3, 4, 6 ర్యాంకులతో అదరగొట్టొంది. కానీ గత రెండేండ్లలో మాత్రం 9వ స్థానానికి పరిమితమై నిరాశపరిచింది. ప్రస్తుత సీజన్ లో తొలి మూడు రేసులలో 18 పాయింట్లు గెలిచిన ‘మహీంద్ర రేసింగ్’.. ఆరో స్థానంలో కొనసాగుతోంది. స్వదేశంలో హైదరాబాద్ లో సొంత అభిమానుల మధ్య జరుగుతున్న ఈ పోటీలలో అదరగొట్టాలని మహీంద్ర టీమ్ భావిస్తున్నది. హైదరాబాద్ లో మహీంద్ర టీమ్ గనక విజయవంతమైతే దానికి రెండు లాభాలున్నాయి. అటు రేసింగ్ లో స్థానంతో పాటు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతుంది.
మహీంద్ర డ్రైవర్లు..
మహీంద్ర రేసింగ్ కు డ్రైవర్లుగా బ్రెజిల్ కు చెందిన లుకాస్ డి గ్రాసి, ఇంగ్లాండ్ వాసి ఒలివర్ రోలాండ్ ఉన్నారు. లుకాస్ గతంలో ఫార్ములా ఈ ఛాంపియన్ గా నిలిచాడు. 2016-17 సీజన్ లో అతడు ఏబీటీ ఆడి స్పోర్ట్స్ తరఫున విజేతగా ఉన్నాడు. ఈ సీజన్ లోనే మహీంద్రతో చేరిన లుకాస్.. భారత్ లో అదరగొట్టాలని చూస్తున్నాడు. మరి లుకాస్ మహీంద్ర ఆశలను నెరవేరుస్తాడా..? లేదా..? అన్నది శనివారం వరకు వేచి చూడాలి.