భారత్-వెస్టిండిస్ ల మధ్య రెండో టీ20 ఇవాళ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరగనుంది. ఇకానా అంతర్జాతీయ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ ఇప్పుడు భారత రత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియం లక్నోలో ఎక్కడుందని ఆశ్చర్యపోతున్నారా...అయితే కింది స్టోరీ చదవండి. 

భారత జట్టు వెస్టిండిస్ తో రెండు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇందులో ఓ మ్యాచ్ ఇప్పటికే కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగింది. ఇందులో విండీస్ పై భారత్ విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్  లక్నోలో కొత్తగా నిర్మించిన ఇకానా స్టేడియంలో ఇవాళ (మంగళవారం) జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ఒక్కరోజు ముందు అంటే సోమవారం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. 

ఈ స్టేడియంకు దివంగత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది. ఆయన జ్ఞాపకార్థం ఇకానా స్టేడియం పేరును మార్చి ‘భారత రత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంతర్జాతీయ స్టేడియం’గా మారుస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.  

యోగి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రతిపక్ష ఎస్పీ, బీఎస్పీ పార్టీలు వ్యయతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రజల సమస్యలను పక్కనబెట్టి బిజెపి ప్రభుత్వం నగరాలు,, స్టేడియాల పేరు మారుస్తూ షో చేస్తోందని వారు మండిపడుతున్నారు.