Asianet News TeluguAsianet News Telugu

సునీల్ ఛెత్రీ రిక్వెస్ట్: కేటీఆర్, విరాట్ కోహ్లీ స్పందన ఇలా...

"మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ స్టేడియానికి వచ్చి మేం ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడండి"  అని భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి చేసిన విజ్ఞప్తికి పలువురు స్పందిస్తున్నారు.

KTR reacts on Sunil Chetri's request

హైదరాబాద్: "మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ స్టేడియానికి వచ్చి మేం ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూడండి"  అని భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి చేసిన విజ్ఞప్తికి పలువురు స్పందిస్తున్నారు. ఆయన ఆవేదనతో చేసిన అభ్యర్థనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చెత్రీ అభ్యర్థనపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్పందించారు. తెలంగాణ మంత్రి కెటి రామారావు తనదైన శైలిలో స్పందించారు. చెత్రీ  ట్వీట్‌ను ఆయన రీట్వీట్  చేశారు. 

"నేను త్వరలోనే ఫుట్‌బాల్ గేమ్ చూసేందుకు వెళ్తున్నాను. మీ సంగతేమిటి?" అని తన ఫాలోవర్లను ప్రశ్నించారు. "చెత్రీ వీడియోను రీట్వీట్ చేయండి, అతడి సందేశాన్ని అందరికీ చేరవేయండి" అని ఆయన కోరారు. 

భారత ఫుట్‌బాల్ జట్టు ఆడే మ్యాచ్‌లను మైదానానికి వెళ్లి చూడాలని కోహ్లి తన అభిమానులను ట్విట్టర్ ద్వారా కోరాడు. ఫుట్‌బాల్ ను, క్రీడలను ప్రోత్సహించాలని కోహ్లి పిలుపునిచ్చాడు. దేశంలో క్రీడా సంస్కృతి పెంపొందించాలని కోహ్లీ సూచించాడు.

"మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ భారత ఫుట్‌బాల్‌ జట్టు ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి చూడండి. యూరోపియన్‌ ఫుట్‌బాల్ క్లబ్‌లకు మద్దుతు తెలిపే మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా" అని ఛెత్రీ అన్నాడు. 

"ఆటలో వారి స్థాయిని మేం అందుకోలేకపోవచ్చు. మా మ్యాచ్‌కు వచ్చి సమయం వృధా ఎందుకు చేసుకోవాలని అనిపించవచ్చు. మేం కాదని అనడం లేదు, ఆ స్థాయిలో మా ఆట లేదనే విషయాన్ని కూడా అంగీకరిస్తాం. కానీ ఆట పట్ల మా నిబద్ధతతో, ప్రేమతో మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాం" అని అన్నాడు.

ప్రస్తుతం భారత ఫుట్‌బాల్ జట్టు 97వ స్థానంలో ఉంది. శుక్రవారం నాలుగు దేశాల టోర్నీ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో 5-0 తేడాతో చైనీస్‌ తైపీపై విజయం సాధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios