కోహ్లీవి పచ్చి అబద్ధాలు: అండర్సన్ సంచలన వ్యాఖ్యలు

First Published 23, Jul 2018, 9:57 PM IST
Kohli is lying if he says his runs don't matter, says James Anderson
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లాండు పేసర్ జేమ్స్ అండర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇంగ్లాండు, భారత జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో అండర్సన్ విరాట్ కోహ్లీపై మాటల తూటాలు విసిరాడు.

లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లాండు పేసర్ జేమ్స్ అండర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇంగ్లాండు, భారత జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో అండర్సన్ విరాట్ కోహ్లీపై మాటల తూటాలు విసిరాడు. 

భారత జట్టు విజయాలు సాధిస్తున్నంత కాలం తాను పరుగులు చేయకున్నా ఫర్వాలేదని విరాట్  చెప్పే మాట అబద్ధమని అండర్‌సన్ అన్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ పరుగులు చేయకున్నా ఫర్వాలేదా? అలాగైతే అతను కచ్చితంగా అబద్ధం ఆడుతున్నాడని అన్నాడు. 

ఇంగ్లాండులో భారత్ విజయం సాధించాలంటే కచ్చితంగా కోహ్లీ పరుగులు చేయాల్సిందేనని, కోహ్లీ పరుగులు చేసేందుకు ఎప్పుడు ఆసక్తిగా ఉంటాడని అన్నాడు. ఒక కెప్టెన్, ప్రపంచంలోనే ఉత్తమ ఆటగాడి నుంచి ఏం ఆశిస్తామని అన్నాడు.
 
2014 ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ ఏ మాత్రం రాణించలేకపోయాడు. ఐదు టెస్టుల్లో కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు. కాగా, అండర్‌సన్‌కి కోహ్లీపై మంచి రికార్డు ఉంది. 2014 పర్యటనలో కోహ్లీని నాలుగు సార్లు, 2012లో ఐదు సార్లు ఔట్ చేశాడు. 

అయితే, 2016-17లో జరిగిన సిరీస్‌లో మాత్రం కోహ్లీ ధారాళంగా పరుగులు పిండుకున్నాడు. నాలుగు టెస్టుల్లో 655 పరుగులు చేసి టీమిండియా 4-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ పర్యటనలో అండర్‌సన్మూడు టెస్టుల్లో ఆండర్‌సన్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు.
 
కోహ్లీ తన బలహీనతలను అధిగమించేందుకు చాలా ప్రాక్టీస్ చేస్తాడని, కానీ ఈ సిరీస్‌లో పోటీ తనకూ అతడికీ మధ్య మాత్రమే కాదని, అతనికి మిగతా బౌలర్లకి కూడా అని అన్నాడు. 
 
 విరాట్ కోహ్లీ, జో రూట్‌లలో ఎవరు గొప్ప బ్యాట్స్‌మెన్ అని అడిగితే, వీరిలో ఒకరిని ఎంచుకోవడం కష్టమని, పరిస్థితిని బట్టి ఒక్కొక్కరు.. ఒక్కోలా ఆడతారని, నిజం చెప్పాలంటే వీరిలో ఎవరికీ తాను బౌలింగ్‌ చేయాలనుకోవడం లేదని అన్నాడు.

loader