ఆస్ట్రేలియా-శ్రీలంకల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ప్రమాదం చోటుచేసుకుంది. ఆసిస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ విసిరిన బౌన్సర్ కు శ్రీలంకకు క్రికెటర్ దిముత్ క‌రుణ‌ర‌త్నే తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. వేగంగా వచ్చిన బంతి తగలగానే కరుణరత్నే మైదానంలోనే కుప్పకూలిపోయాడు.

శ్రీలంక బ్యాట్ మెన్ కరుణ‌ర‌త్నే 46 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కమ్మిన్స్ విసిరిన బంతి 142 కిలోమీటర్ల వేగంతో వచ్చి తిలకరత్నే మెడ భాగంలో
తగిలింది. దీంతో విలవిల్లాడిపోయిన అతడు మైదానంలోనే కుప్పకూలిపోయాడు. 

దీంతో అతన్ని రిటైర్‌హార్ట్ గా ప్రకటించి స్ట్రెచర్ పై మైదానం బయటకు తీసువచ్చి జట్టు ఫిజియో ప్రథమ చికిత్స అందించాడు. అయినా నొప్పి ఎక్కువగా వుండటంతో ఆస్పత్రికి తరలించారు. అత్యంత వేగంగా వచ్చిన బంతి తగలడం వల్ల మెడ బాగంలో తీవ్ర గాయమవడంతో పాటు చేతి నరాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు డాక్టర్లు తెలిపారు. అయితే ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నామని...ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు డాక్టర్లు తెలిపారు.

 ఇలా హెల్మెట్ ధరించి వున్నా మరో క్రికెటర్ తీవ్రంగా గాయపడటంతో క్రికెటర్ రక్షణపై మరోసారి చర్చ ప్రారంభమయయ్యింది. ఇదే ఆస్ట్రేలియా వేదికపై 2014లో ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్ ఫిలిప్ హ్యూస్ కు బంతి తగిలి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా చాలా మంది క్రికెటర్లకు ఇలా బంతి తగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి సంఘటనలు జరిగిన సమయంలో క్రికెటర్ల రక్షణపై చర్చలు జరగ్గా...ఆ తర్వాత దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. తాజా సంఘటనతో మరోసారి ఈ విషయం చర్చనీయాంశమయ్యింది.